ఆరోగ్య శాఖలో 22 కొత్త పథకాలు

0
37

– త్వరలో డాక్టర్ల నియామకం
– ఆర్థిక మంత్రి యనమల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 22 కొత్త పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. దోమలపై యుద్ధం ప్రకటించడంతో నివారణా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ‘కాలానుగుణ వ్యాధులు’ అంశంపై ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇచ్చిన నోటీసులో భాగంగా మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలూ విజయవంతమయ్యాయన్నారు. బడ్జెట్‌లో కేంద్రం కేవలం 2 శాతం మాత్రమే వైద్య ఆరోగ్య శాఖకు నిధులు కేటాయిస్తే, రాష్ట్రం మాత్రం 4 శాతం కంటే అధికంగా ఖర్చు చేస్తోందన్నారు. ప్రధానమైన అంశాలపై కేంద్రం సహకారం లేదన్నారు. డెంగీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. రాజోలులోని కిడ్నీ సెంటర్‌ను పరిశీలిస్తామన్నారు. విశాఖ కెజిహెచ్‌ పరిసరాలు స్లమ్‌ ఏరియా కావడంతో అక్కడ జ్వరాల నమోదు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. డాక్టర్ల కొరత నివారించేందుకు నియామకాలకు త్వరలో అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. పారామెడికల్‌ సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయనీ, కొత్త పిహెచ్‌సిల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.
అంతకు ముందు జరిగిన చర్చలో బిజెపి శాసనసభపక్షనేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ బిజెపిపై బురద జల్లే విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సక్సెస్‌ అయ్యిందనీ, దోమలపై దండయాత్ర పూర్తిగా ఫెల్యూర్‌ అయ్యిందనీ అన్నారు. కెజిహెచ్‌ను సిఎం సందర్శించాలని కోరారు. ఆసుపత్రిలో ఒక్కో బెడ్‌పై ఇద్దరు పడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యేలు మృణాళిని ఆనందరావు, బాలవీరాస్వామి, అప్పలనాయుడు, రామకృష్ణబాబు, ఈశ్వరి తదితరులు ఈ అంశంపై మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here