కొండంత విషాదం

0
38

– లోయలో పడిన బస్సు
– 57 మంది మృతి
– జగిత్యాలలో ఘోరం
ఒకటి, రెండు నిమిషాల్లో ఆ బస్సు ఘాట్‌రోడ్డును వీడి ప్రధాన రహదారిపైకి వచ్చేస్తుంది! కిక్కిరిసి ఉన్న ప్రయాణీకులు ఎవరి హడావిడిలో వారు ఉన్నారు. అంతలోనే, ఒక్క కుదుపు. బస్సు అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న చిన్న లోయలోకి దూసుకెళ్లింది! ప్రయాణీకులంతా డ్రైవర్‌ వైపు పడిపోయారు. హాహాకారాలు.. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది! ఏం జరిగిందో అర్ధమయ్యే లోపే మృత్యువు విరుచుకుపడింది. బండరాళ్లపై బస్సు పడటంతో ప్రయాణీకుల తలలు పగిలాయి. కాళ్లు చేతులు విరిగాయి. ఒకరు, ఇద్దరు కాదు… 57 మంది మృత్యువాత పడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో 27 మంది మహిళలే! అభం శుభం తెలియని పసిపిల్లలూ ప్రాణాలు వదిలారు. సంఘటనా స్థలంలోనే 37 మంది మరణించగా, మిగిలిన వారు ఆస్పత్రిలో మృతి చెందారు. ఊహకందని ఈ పెను విషాదంతో తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు బోరున విలపిస్తోంది! రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఆర్‌టిసి) చరిత్రలోనే ఇది అతి పెద్ద ప్రమాదంగా చెబుతున్నారు.
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారుగా 86 మందితో కిక్కిరిసి ఉన్న ఆర్టీసి బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 57 మంది మృతి చెందారు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ప్రమాదంలో గాయాలబారిన పడకుండా ఒక్కరు కూడా బయటపడలేదు. చికిత్సపొందుతున్న వారిలో పలువురి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. జగిత్యాల డిపోకు చెందిన బస్సు మంగళవారం ఉదయం 10:20 గంటలకు కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి కొండగట్టు ఘాట్‌రోడ్‌ మీదగా జగిత్యాల వైపు వస్తోంది. బస్సులో సామర్థ్యానికి మించి 86మంది ప్రయాణికులు ఎక్కారు. ఉదయం 11:10 గంటలకు బస్సు ఘాట్‌రోడ్‌ చివరి మలుపు వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌కు స్టీరింగ్‌ కంట్రోల్‌ తప్పింది. ముందుగా వెళుతున్న కారును తప్పించబోయి కుడివైపు మలుపు తీసుకోగా టాటా ఏస్‌ ఆటోకు ఢకొీని రెయిలింగ్‌ను తోసుకుంటూ ఒక్కసారిగా లోయలోకి దూసుకుపోయింది. దీంతో ప్రయాణీకులు ముందువైపునక పడిపోయారు. బస్సు రాళ్లను ఢకొీంటూ పల్టీలు కొడుతూ కిందకు పడిపోయింది. బస్సులోని చిన్నారులు, మహిళలు ప్రమాద ధాటికి విరిగిపోయిన సీట్లల్లో ఇరుక్కుపోయారు. వీరు ఊపిరాడక మరణించారు. చాలామంది తలకు తీవ్ర గాయాలవడంతో ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. బస్సులో ఉన్న ప్రయాణీకుల్లో 37 మంది అక్కడికక్కడే మృతి చెందారు.. మృతులంతా చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది మహిళలు చిన్నారులే ఉన్నారు. కాలేజీకి వెళుతున్న విద్యార్ధులు కూడా ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. సంఘటనా స్థలంలో తమవారిని గుర్తుపట్టడం కుటుంబ సభ్యులకు కష్టంగా మారింది. వీరి రోదనలతో ఆ ప్రాంతం మారుమ్రోగు తోంది. మరో 13 మంది జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో, కరీంనగర్‌ ఆస్పత్రిలో ఏడుగురు చికిత్స పొందుతూ కన్నుమూసారు. గాయపడిన వారిని కరీంనగర్‌, హైదరాబాద్‌, జగిత్యాల ఆస్పత్రులకు తరలించారు. సంఘటన తెలిసిన వెంటనే మల్యాల సీఐ నాగేందర్‌గౌడ్‌, ఎస్‌ఐ మిథున్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ సింధూశర్మ, చుట్టూ పక్కల మండలాల ఎస్‌ఐలు చేరుకునే లోపే స్థానికంగా ఉన్న జీపు డ్రైవర్లు లోయలో పడ్డ బస్సు వద్దకు వెళ్లి క్షతగాత్రులను బయటకు తీయడం ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here