పిఎంవోకు చెప్పినా పట్టించుకోలేదు

0
45

న్యూఢిల్లీ: ప్రభుత్వాల అలసత్వంతోనే బ్యాంకు మోసాలు పెరిగిపోతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పష్టం చేశారు. తాను గవర్నర్‌గా వున్న సమయంలో ఇటువంటి మోసాలపై ప్రధాని కార్యాలయానికి ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆయన ఆర్థికశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి రాసిన లేఖలో వివరణ ఇచ్చారు. సమాజంలోని అత్యున్నత స్థాయి వర్గాలు బ్యాంకులను మోసం చేసిన వైనం, బ్యాంకుల్లో పేరుకుపోతున్న అనుత్పాదక ఆస్తులు (పారు బకాయిల) పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని తాను ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన తెలిపారు. రాజన్‌ ఈ లేఖలను గత యుపిఎ ప్రభుత్వానికీ, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి రాశారు. అయితే గత ప్రభుత్వం ఈ లేఖలను పట్టించుకున్నదీ లేనిదీ తెలియనప్పటికీ ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, లేదా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కానీ దీనిపై స్పందించిన దాఖలాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంకులను వేధిస్తున్న ఎన్‌పిఎ సంక్షోభంపై రాజన్‌ అభిప్రాయాలు కోరిన డా.మురళీ మనోహర్‌ జోషి నేతృత్వంలోని పార్లమెంట్‌ అంచనాల సంఘానికి పంపిన జవాబులో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. రాజన్‌ తన జవాబులో పేర్కొన్న పిఎంఓ అన్నది ప్రస్తుత ప్రధాని కార్యాలయాన్నుద్దేశించి రాసినదేనని భావిస్తున్న అంచనాల కమిటీ పిఎంఓకు ఏ తేదీన లేఖ రాశారో ఆ వివరాలను వెల్లడించాలని కోరినట్లు తెలుస్తోంది. బ్యాంకు మోసాలపై చర్యలకు ప్రస్తుత ప్రభుత్వానిదే బాధ్యత అని కమిటీ సభ్యుడొకరు స్పష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here