మార్కెట్‌ ప్రకంపనలు

0
8

దలాల్‌ స్ట్రీట్‌లో సానుకూల పరిణామాలు కానరావడం లేదు. ప్రభుత్వ విధానాలకు తోడు అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు దేశీయ స్టాక్‌ మార్కెట్లను కుదేల్‌ చేస్తున్నాయి. వరుసగా రెండో రోజూ మంగళవారం మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కొనసాగడానికి తోడు కరెంట్‌ ఎకౌంట్‌ లోటు గుబులు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. విదేశీ బాండ్లపై ప్రభుత్వ చెల్లింపుల భారం తదితర పరిణామాలు దలాల్‌ స్ట్రీట్‌లో దడ పుట్టిస్తున్నాయి. చైనా వాణిజ్యంపై అమెరికా కాలుదువ్వడం లాంటి అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల మధ్య మదుపర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలోనే బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 509.04 పాయింట్లు లేదా 1.34 శాతం పతనమై 37,413.13కు పడిపోయింది. గత ఆరు నెలల్లో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 150.60 పాయింట్లు లేదా 1.32 శాతం కోల్పోయి 11,287.50కు దిగజారింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జిడిపిలో కరెంట్‌ ఎకౌంట్‌ లోటు 2.4 శాతానికి చేరిందన్న ఆర్‌బిఐ గణంకాలు దేశ ఆర్ధిక వ్యవస్థపై అనుమానాలు పెంచాయి. వచ్చే ఆరు నెలల్లో డాలర్‌తో రూపాయి విలువ 74-75కు పడిపోవచ్చన్న విశ్లేషకులు అంచనాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మరోవైపు క్రమంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here