రక్షణ బంధమా? బంధనమా?

0
46

అమెరికాతో ఇటీవల కుదుర్చుకున్న ‘కామ్‌ కాసా’ (కాంప్రెహెన్సివ్‌ సెమాంటిక్‌ కమ్యూనికేషన్స్‌,కంపాటబిలిటీ అండ్‌ సెక్యూరిటీ అగ్రిమెంట్‌) ఒప్పందంతో ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటోలో మన దేశం కూడా అనధికారిక భాగస్వామిగా చేరినట్లైంది. సెప్టెంబరు6న న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల(2+2) తొలి సమావేశంలో కుదిరిన ఈ ఒప్పందాన్ని 21వ శతాబ్దపు రక్షణ బంధమని, చారిత్రాత్మకమని, మైలు రాయి అని ఒప్పందంపై సంతకాల అనంతరం ఇరు దేశాల మంత్రులు ఊదరగొట్టారు. వాటినే కార్పొరేట్‌ ప్రచార బాకాలు పెద్దయెత్తున ప్రచారంలో పెట్టాయి. నిజానికి ఇది రక్షణ బంధం కాదు, భారత్‌కు వేసిన సంకెల. అమెరికా తన సైనిక ఉచ్చులో భారత్‌ను బిగించేందుకు దీనినొక సాధనంగా ఉపయోగించుకుంటోంది. అమెరికాతో సన్నిహిత సైనిక మిత్రపక్షంగా చేరాలనుకునే ఏ దేశమైనా నాలుగు మౌలిక ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి వుంటుంది. అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా భారత్‌ను మార్చేందుకు తహతహలాడుతున్న మోడీ ప్రభుత్వం ఈ నాలుగింటిలో మూడోది అయిన కామ్‌ కాసా ఒప్పందంపై తాజాగా సంతకం చేసింది. మొదటి రెండు ఒప్పందాలు గిజ్‌మోయా (2002), లెసోతో (2016) లను ఇదివరకే కుదుర్చుకుంది. భద్రతకు సంబంధించిన సమాచారాన్ని అమెరికాతో పంచుకోవడానికి మొదటి ఒప్పందం వీలు కల్పిస్తుండగా, రెండో ఒప్పందం మిలిటరీ సదుపాయాలను అమెరికా సైన్యం ఉపయోగించుకునేందుకు రాచబాట వేసింది. బేసిక్‌ ఎక్స్‌ఛేంజి సహకార ఒప్పందం మీద సంతకం చేస్తే భారత్‌ అమెరికా సైనిక కూటమిలో పూర్తి స్థాయి సభ్యురాలవుతుంది. చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను నిలపాలన్న అగ్రరాజ్య దుస్తంత్రంలో భాగమే ప్రస్తుత కామ్‌కాసా ఒప్పందం. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌, అమెరికాలు రెండూ తూర్పు తీరంలో తొలిసారి సంయుక్త నావికా, వైమానిక విన్యాసాలు నిర్వహించబోతున్నాయి. ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో భారత్‌ను బందీగావించాలని తహతహలాడుతున్న ట్రంప్‌ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వం ఈ రూపంలో కానుక ఇచ్చింది. భారత్‌, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకుద్దేశించిన 2+2 మంత్రుల స్థాయి సమావేశం ప్రతి యేటా ఇరు దేశాల విదేశాంగ, వాణిజ్య మంత్రుల మధ్య జరుగుతూ వుండేవి. ఈ సారి వాణిజ్య మంత్రుల స్థానే రక్షణ మంత్రులు చర్చల్లో పాల్గొనడంలో ఆంతర్యం తెలియనిదేమీ కాదు. అమెరికా వ్యూహాత్మక సైనిక బంధం ముందుకు సాగాలంటే రక్షణ మంత్రిత్వశాఖల భాగస్వామ్యం అత్యంత కీలకం. భారత రక్షణ రంగంలోకి అమెరికా కమ్యూనికేషన్‌ వ్యవస్థ చొరబడడానికి ఈ ఒప్పందం వీలుకల్పిస్తున్నది. అమెరికా నుంచి ఇప్పటికే కొనుగోలు చేసిన 130 గ్లెన్‌క్లేస్‌, సి17 గ్లోబ్‌ మాస్టర్‌, పి-81 యుద్ధ విమానాలతోపాటు, అపాచె, చింకూర్‌, ఇతర హెలికాప్టర్లలో అమెరికా ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను అమరుస్తారు. దీని ద్వారా భారత సాయుధ బలగాల మిలిటరీ కమ్యూనికేషన్‌ వ్యవస్థతో పెంటగాన్‌కు సులువుగా అనుసంధానమేర్పడుతుంది. అంతేకాదు, భారత్‌కు అందిస్తున్న అధునాతన మిలిలరీ పరికరాలను మనం దేనికోసం ఉపయోగిస్తున్నదీ అగ్రరాజ్యం నిరంతర నిఘా ఉంచుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here