Sidebar


Welcome to Vizag Express
ఆ షోలు రద్దు చేశామంటూ మళ్లీ యు ట‌ర్న్ ఎందుకు...?

10-01-2025 22:25:09

ఆ షోలు రద్దు చేశామంటూ మళ్లీ యు ట‌ర్న్ ఎందుకు...? 

. తెలంగాణ స‌ర్కారుపై హైకోర్టు అసంతృప్తి

- ఈ నెల 24న వాయిదా

హైదరాబాద్, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌, జనవరి 10: గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  ప్రత్యేక ప్రదర్శనాల అనుమతిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని న్యాయస్థానం ప్రశ్నించింది. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా... బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ జైలుకు వెళ్లి.. బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే తొక్కిసలాట ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇకపై బెన్‌ఫిట్‌షోలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దిల్‌ రాజు నేతృత్వంలో సినీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలువగా ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు .

మ‌రి ఇప్పుడిలా ఎందుకు...?

 శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన గేమ్‌ చేంజర్ సినిమా టికెట్‌ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అర్ధారత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు అనుమతించని ప్రభుత్వం.. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల షోకు అనుమతినిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల పెంపు, స్పెషల్ షోలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ను జస్టిస్ బి.విజయ్‌సేన్‌ రెడ్డి విచారించగా.. గేమ్ చేంజర్ సినిమా స్పెషల్ షోకు అనుమతి ఇవ్వడంపై పిటిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టికెట్ పెంపుపై ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశించాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. దీనిపై విచారణను శుక్ర‌వారానికి వాయిదా వేసిన కోర్టు.. శుక్ర‌వారం విచారణలో ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 24కు హైకోర్టు వాయిదా వేసింది.