టెక్కలిపట్నం ... రహదారి నరకప్రాయం
– పలాస– పర్లాఖిమిడికి ఇదే మార్గం
– రోజూ పాతిక సార్లు బస్సుల రాకపోకలు
– ఆటోలు, ఇతర వాహనాలు వందల్లోనే
– దశాబ్దాలుగా గతకులతోనే, ఈ మధ్యలోనే పనులు ప్రారంభం
– బిట్లుబిట్లుగా ప్రారంభించి గ్రామంలోనే వదిలేసి
పలాస, వైజాగ్ ఎక్స్‌ప్రెస్; పలాస మండలంలోని టెక్కలిపట్నం ప్రధాన రహదారి ప్రయాణికులను, వాహనచోదకులను న రకప్రాయంగా మారింది. ఈ రహదారి గుండానే పర్లాఖిమిడి నుంచి పలాసకు, పలాస నుంచి పర్లాఖిమిడికి బస్సులు, ఇతరత్రా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజుకు పాతికపైనే ప్రయివేటు, ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. వందలాది మంది ప్రయాణికులు ప్రయాణం సాగిస్తుంటారు. ఇక ఆటోలు, ద్విచక్ర వాహనాలు, వ్యాన్లు వందల్లోనే వచ్చీపోతుంటాయి. ఇంత రద్దీగా ఉన్న ఈ రహదారి దశాబ్దాలుగా గతకలమయంగా...గజానికో గుంతలతో భయపెడుతుంటాయి. వైఎస్సార్‌సీపీ సర్కారు హయాంలో, అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు జోక్యంతో ఎట్టకేలకు రోడ్డు పక్కాగా వేయడానికి కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పనులు చేపట్టడం ప్రారంభించారు. ఓ వైపు కల్వర్టులు నిర్మిస్తూ మరో వైపు రహదారి వెడల్పు పనులు చేపట్టారు. ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి. ఎన్నికల అనంతరం మళ్లీ ప్రారంభించారు. బెండి గేటు మలుపు దగ్గర నుంచి ప్రారంభమైన పనులు టెక్కలి పట్నం వరకు మధ్యలో పలు గ్రామాల వద్ద పూర్తయ్యాయి. కానీ పంచాయతీ కేంద్రం, ఆ ప్రాంతాలకు కీలకం గ్రామంగా ... వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన ఇక్కడే ఆర కిలోమీటరు దూరం గుంతలమయంగా మిగిలిపోయింది. ఈ రహదారి నుంచి పర్లాఖిమిడి వరకు ఇలాగే ఉంది. ఎలాగూ ఒడిశా పరిధిదాటి రహదారి వేయలేం ... ఆంధ్ర సరిహద్దు తరువాత టెక్కలిపట్నం వరకు రహదారి వేస్తే పది గ్రామాలకు పైగా ప్రయోజనం చేకూరుతుందని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు.