పి.ఎం.ఇ.జి.పితో ఉపాధి అవకాశాలు
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 15 :
ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పి.ఎం.ఇ.జి.పి)తో స్వయం ఉపాధి అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పి.ఎం.ఇ.జి.పిలో వివిధ రంగాల్లో స్వయం ఉపాధి కలాపాలకు రుణాలు అందిస్తుందని ఆయన చెప్పారు. తయారీ రంగ కార్యకలాపాలకు రూ.50 లక్షలు, సేవా రంగ విభాగానికి రూ.20 లక్షల వరకు బ్యాంకు రుణం లభిస్తుందని ఆయన చెప్పారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 35 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని, లబ్దిదారుని వాటా 5 నుండి 10 శాతం ఉంటుందని ఆయన అన్నారు. నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఆర్ధిక సహాయం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పి.ఎం.ఇ.జి.పి, ఆర్.ఇ.జి.పి, ముద్ర పథకంలో భాగంగా రెండవ దశ రుణంలో తయారీ రంగానికి రూ.1 కోటి వరకు బ్యాంకు రుణం, సేవా రంగ కార్యకలాపాలకు రూ.25 లక్షలు లభిస్తుందని తెలిపారు. ప్రాజెక్ట్ వ్యయంలో 15 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని ఆయన చెప్పారు.
18 సంవత్సరాలకు పైగా వయస్సు కలిగి ఉన్న వ్యక్తులు అర్హులని తెలిపారు. వ్యక్తిగత ఆదాయ పరిమితి లేదని, రూ.10 లక్షలు పైబడిన తయారీ రంగ పరిశ్రమలకు, రూ. 5 లక్షలు పైబడిన సేవా రంగ పరిశ్రమలకు కనీస విద్యార్హత 8 వ తరగతి ఉత్తీర్ణత ఉండాలని ఆయన చెప్పారు. నూతనంగా ప్రారంభించే పరిశ్రమలకు మాత్రమే ఈ సబ్సిడి పథకము వర్తిస్తుందని ఆయన తెలిపారు. వివరాలకు
www.kviconline.gov.in/pmegpeportal వెబ్ సైట్ లో చూడవచ్చని, దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించాలని ఆయన వివరించారు.
వివిధ వ్యాపార ఆలోచనలకు ప్రతి ఆదివారం ప్రత్యక్ష వెబినార్ లో పాల్గొనవచ్చని, అందుకు http://www. udyami.in.workshop లో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.