Sidebar


Welcome to Vizag Express
ప్రిజం టెన్ కు ప్రధానమంత్రి అవార్డు

15-01-2025 21:33:39

ప్రిజం టెన్ కు ప్రధానమంత్రి అవార్డు 

పార్వతీపురం,వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 15 : జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రిజం టెన్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి అవార్డు లభించింది. ప్రిజం 10లో భాగంగా ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులలో రక్తహీనత నివారణకు పెద్ద ఎత్తున 2023 - 24 సంవత్సరంలో చర్యలు చేపట్టడం జరిగింది. అప్పటి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ స్థాయిలో రక్తహీనత కమిటీలు ఏర్పాటు చేయడం, నిశితంగా పర్యవేక్షణ చేయడం ద్వారా గణనీయమైన ఫలితాలు సాధించడం జరిగింది. ముఖ్యంగా పాచిపెంట మండలంలో మరిన్ని మంచి ఫలితాలు లభించాయి. పాచిపెంట మండల పరిషత్ అభివృద్ధికారిగా పనిచేసిన లక్ష్మీకాంత్ మండలంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన ఫలితాలు సాధించడం జరిగింది. పౌష్టికాహారం అందించడమే కాకుండా దత్తత అధికారులను గ్రామస్థాయిలో ఏర్పాటు చేసి రక్తహీనత కలిగిన వారిని దత్తత తీసుకోవడం, వారు పర్యవేక్షణ నిర్ధిష్టంగా చేయడం అంతేకాకుండా కొంతమంది దత్తత అధికారులు స్వయంగా సొంతంగా ఖర్చు చేసి డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహార పదార్థాలను అందించడం కూడా జరిగింది. ఇది గొప్ప స్ఫూర్తిదాయకం. ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ కూడా రక్తహీనత నివారణ పై  పెద్ద ఎత్తున దృష్టి సారించారు. ఈ అవార్డు మరింత స్ఫూర్తిని నింపి జిల్లాలో మరింత ఎక్కువగా దానిపై దృష్టి సారించుటకు ప్రోత్సాహంకానుంది. చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతల్లో రక్త హీనతపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఈ నెల 21న ఢిల్లీలో జరిగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో అప్పటి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బహుమతిని అందుకోనున్నారు. ప్రిజం ప్రాజెక్టు పై ఆయన చేసిన ప్రశంసనీయమైన సేవలకు గాను ఈ బహుమతిని  అందిస్తున్నారు.