దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలి
విశాఖ పట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్;
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న స్టీల్ పరిశ్రమలలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని అఖిలభారత సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తప్పన్ సేన్ పిలుపునిచ్చారు. నేడు కోల్ కత్త లో స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తప్పన్ సేన్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం లోని బిజెపి తన నిరంకుశ వైఖరిని అత్యంత వేగంగా అమలు చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ లో విఆర్ఎస్ ప్రవేశపెట్టి తద్వారా తన తాబేదారులకు కట్టబెట్టే ప్రక్రియను ప్రారంభించిందని ఆయన వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతూ దీనికి సొంత ఐరన్ ఓర్ గనులను కేటాయించడమే పరిష్కారమని ఆయన అన్నారు. నేడు ప్రభుత్వం ఒరిస్సా లోని సెయిల్ ఐరన్ ఓర్ గనులను అదాని ప్రైవేటు సంస్థకు కేటాయిస్తూ నిర్ణయం చేశారని, దీనిని వ్యతిరేకిస్తూ అక్కడ ఉద్యమం సాగుతోందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విశాఖ స్టీల్ కార్మికులకు నాలుగు నెలల నుండి జీతాలు చెల్లించకుండా కార్మికుల పై జరుపుతున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కనుక స్టీల్ పరిశ్రమ పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉద్యమాలను మరింత ఉధృతం చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న స్టీల్ కార్మికులు ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సభ్యులు జె అయోధ్య రామ్, యు రామస్వామి, ఓ వి రావు, స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి లలిత్ మిశ్రా తదితరులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.