నా రాజీనామా నిర్ణయానికి సార్ధకత
స్టీల్ ప్లాంట్ పరిశ్రమ కాదు.. తెలుగువారి ఆత్మ గౌరవం
పునరుజ్జీవ ప్యాకేజీ పై భీమిలి ఎమ్మెల్యే గంటా
విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 17: స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవానికి కేంద్రం రూ.11,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతో తన రాజీనామా నిర్ణయానికి సార్థకత లభించిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎం.వి.పి.కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను తెలుగు వారెవరూ ఒక పరిశ్రమగా చూడరని, ఆంధ్రుల ఆత్మ గౌరవానికి అది ప్రతీకని పేర్కొన్నారు. విశాఖ నార్త్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు నిరసనగా 2021 ఫిబ్రవరి 12 న స్పీకర్ ఫార్మెట్ లో తాను రాజీనామా చేశానని గుర్తు చేశారు. తన రాజీనామా అప్పట్లో కార్మిక లోకానికి నైతిక స్థైర్యాన్ని ఇచ్చిందన్నారు. 32 మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను కేంద్రం మద్దతుతో కాపాడుకుని శాశ్వతంగా లాభాల బాటలోకి తీసుకు వెళ్లాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పాతికేళ్ల క్రితం కేంద్రం ప్రైవేటీకరణ ఆలోచన చేసినప్పుడు దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు ఆధ్వర్యంలో 29 మంది లోకసభ, 14 మంది రాజ్యసభ టీడీపీ సభ్యుల బృందాన్ని ప్రధాని వాజేపేయి దగ్గరకు పంపించి ఆ ప్రతిపాదన విరమించుకునేలా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఇప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి భారీ ప్యాకేజీని ప్రకటించేలా చేశారని ప్రశంసించారు. స్టీల్ ప్లాంట్ సహా దాని అనుబంధ సంస్థల ఏర్పాటు కారణంగా వేలాది మందికి ఉపాధి లభించి, విశాఖ ముఖచిత్రమే మారిపోయిందన్నారు.
స్టీల్ ప్లాంట్ కు దన్నుగా కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయనగరం జిల్లా గర్భాం మాంగనీస్ గనుల లీజును విశాఖ స్టీల్ ప్లాంట్ కు మరో 10 ఏళ్లు పెంచామని చెప్పారు. 4,200 మంది కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలను నిలబెట్టామని, రెండు బ్లాస్ట్ ఫర్నేస్ లను వినియోగంలోకి తీసుకు వచ్చామని తెలియజేశారు. ప్రైవేటీకరణ ప్రతిపాదన రాగానే అప్రమత్తమై పోరాటాన్ని సాగించిన కార్మిక, ఉద్యోగ సంఘాలకు గంటా అభినందనలు తెలిపారు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవడానికి అయిదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసింది శూన్యమని ఆయన విమర్శించారు. సొంత కేసుల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు చేయగా, చంద్రబాబు అజెండాలో స్టీల్ ప్లాంట్ అంశం విధిగా ఉండేదని తెలిపారు.
పాలనను పోల్చి చూడండి
రాష్ట్రానికి అనుకూలంగా కొత్త ఏడాదిలో అన్నీ శుభవార్తలు వెలువడుతున్నాయని ఆయన సంతోషం వ్యక్తపరిచారు. ఈనెల 8 న ఉమ్మడి విశాఖ జిల్లాలో రూ.2.10 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖ అంటే ప్రత్యేక అభిమానమన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల అప్పులు మిగిల్చినప్పటికీ ప్రతి నెల 1 వ తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు, ఉద్యోగులు జీతాలు ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెగా డీఎస్సీతో 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నామని, రూ.5 కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. దీపం -2 పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, తల్లికి వందనం, రైతు భరోసా పథకాలకు విధివిధానాలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. రూ.7,200 కోట్లతో గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు వంటి అభివృద్ధి పనులను పెద్దఎత్తున చేపట్టామన్నారు. అయిదేళ్ల వైసీపీ పాలనను ఏడు నెలల కూటమి పరిపాలనతో పోల్చి చూడాలని రాష్ట్ర ప్రజానీకాన్ని కోరారు.
విశాఖను ఐటీ హబ్ చేయడమే లక్ష్యం
విశాఖను ఐటీ హబ్ గా నిలబెట్టడం కోసం ప్రపంచంలో టాప్ 10 ఐటీ కంపెనీలను ఇక్కడకు తీసుకురావడానికి ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. టీసీఎస్, గూగుల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థల ఏర్పాటుతో యువతకు ఉన్నత ఉద్యోగావకాశాలు వస్తాయని తెలియజేశారు. ఐటీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కేంద్రం విధివిధానాలను ప్రకటించిన తర్వాతే పునరుజ్జీవ ప్యాకేజీ ఏ రకంగా ఉండబోతోందన్నది తెలుస్తుందని చెప్పారు.
అనంతరం కూటమి నాయకులతో కలిసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. స్టీల్ ప్లాంట్ కు భారీ మొత్తాన్ని ప్యాకేజీగా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు విశాఖ ప్రజల తరపున గంటా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్పొరేటర్లు పి.వి.నరసింహం, లొడగల అప్పారావు, భీమిలి జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కూటమి నాయకులు కె.రామానాయుడు, శాఖారి శ్రీనివాస్, డి.ఎ.ఎన్.రాజు, కోరాడ రమణ, దామోదరరావు, గంటా నూకరాజు, బి.ఆర్.బి.నాయుడు, తాట్రాజు అప్పారావు, మొల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.