Sidebar


Welcome to Vizag Express
వైజాగ్ స్టీల్ కు రూ.11,440 కోట్ల సాయం చారిత్రక నిర్ణయం

17-01-2025 19:13:20

వైజాగ్ స్టీల్ కు రూ.11,440 కోట్ల సాయం 
చారిత్రక నిర్ణయం 
- కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన 
సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రైవేటీకరిస్తామని మూడేళ్లుగా పట్టుబట్టిన కేంద్రం ఎట్టకేలకు వెనక్కి తగ్గిన‌ట్టు క‌నిపిస్తోంది.  ప్రైవేటీకరణ విషయంలో మనసు మార్చుకుంది. ప్లాంట్ యథావిథిగా పనిచేసేందుకు వీలుగా రూ.11440 కోట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నిర్ణయంపై ఎక్స్ లో సీఎం చంద్రబాబు స్పందించారు. చారిత్రక నిర్ణయం తీసుకున్నారంటూ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ఉక్కుతో చెక్కిన ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుందంటూ  చంద్రబాబు ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11440 కోట్ల సాయంపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన చేస్తున్న వీడియోనూ ఈ ట్వీట్ కు జత చేశారు. ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కేంద్రం ప్రయత్నాలకు ప్రతిస్పందనగా వైజాగ్ స్లీట్ ప్లాంట్ కు రూ.11140 కోట్లు కేటాయించారని సంతోషం వ్యక్తం చేశారు.  దీనిపై గౌరవ ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ,  ఉక్కు కర్మాగారానికి తన అచంచలమైన మద్దతు కోసం మోడీతో పాటు తాను హామీ ఇస్తున్నానన్నారు. వికసిత్ భారత్ -వికసిత్ ఆంధ్రలో భాగంగా దేశ నిర్మాణానికి సంబంధించిన   దూరదృష్టికి ఇది దోహదపడుతుందని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం కర్మాగారం మాత్రమే కాదని, ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పోరాటాలు, స్ఫూర్తికి స్మారక చిహ్నంగా నిలుస్తుందని,  అందరి హృదయాలలో, ముఖ్యంగా వైజాగ్ ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు. ఇది కేవలం ఎన్నికల వాగ్దానం కాదని, ఇది తాము గౌరవించాలని నిశ్చయించుకున్న లోతైన వ్యక్తిగత నిబద్ధత అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు రానున్నాయి.. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు! అంటూ ట్వీట్ ముగించారు