Sidebar


Welcome to Vizag Express
ధాన్యం సేకరణకు రూ.700 కోట్ల నిధులు

17-01-2025 19:14:31

ధాన్యం సేకరణకు రూ.700 కోట్ల నిధులు 

- 63 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి స‌న్న‌ద్ధం
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

అమ‌రావ‌తి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;  2024-25 ఏడాది ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం అవసరమైన రూ.700 కోట్ల నిధుల్ని ఎన్సీడీసీ నుంచి తీసుకునేందుకు పౌరసరఫరాల కార్పోరేషన్ కు బదిలీ చేసేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఏపీ ఫెర్రో అల్లాయిస్ ఉత్పత్తిదారుల విద్యుత్ సుంకంలో గతంలో ఇచ్చిన తగ్గింపుల్ని మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించారు. 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్న క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి మెరుగ్గా ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. తోటపల్లి బ్యారేజ్ మీద హైడ్రో విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. కొపర్తి, ఓర్వకల్లుతో పాటు రాయలసీమలోని పలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ల అభివృద్ధి కోసం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్ని మినహాయిస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. పేదలందరికీ ఇళ్లు కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చేందుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసందుకు కేబినెట్ అనుమతించింది. గతంలో ఏ పథకంలోనూ లబ్దిదారులు రుణాలు పొంది ఉండకూడదని, ఆధార్ కార్డు తప్పనిసరి ఉండాలని వీటికి పరిమితులు పెట్టబోతున్నారు. గతంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన లేఅవుట్ లు నివాస యోగ్యంగా లేనందున వాటిని రద్దు చేసి తిరిగి కొత్తగా కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. కొన్ని లేఅవుట్ లలో కొన్ని ఇళ్లు మాత్రమే కట్టి మిగతా ప్రాంతం ఖాళీగా ఉండటం వంటి కారణాల వల్ల ఇళ్లు కట్టుకోని వారి స్దలాల్ని రద్దు చేసి తిరిగి వేరే చోట ఇల్లు కట్టుకునేందుకు వారికి స్థలం కేటాయించాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఉన్న సౌర విద్యుత్ యూనిట్లను పెట్టుకునేలా ప్రోత్సహించాలని మరో నిర్ణయం తీసుకున్నారు. ఆక్రమణలకు గురైన అభ్యంతరం లేని స్థలాల్లో పేదలకు నివాస స్థలాల్ని క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఆదాయ పెంపుకు ఉన్న అవకాశాలపైనా మంత్రి వర్గం చర్చించింది. వ్యవసాయంతో పాటు అనుబంధ శాఖల్లో ఆదాయం పెంపుపై మంత్రులతో సీఎం చర్చించారు. త్వరలో జరిగే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన విజయవంతం కావాలని కేబినెట్ శుభాకాంక్షలు తెలిపినట్లు మంత్రి పార్ధసారధి వెల్లడించారు.