Sidebar


Welcome to Vizag Express
ఏపీలో మళ్లీ భూముల సర్వే

17-01-2025 19:15:30

ఏపీలో మళ్లీ భూముల సర్వే 

-జగన్ ను తప్పు బ‌ట్టి మ‌ళ్లీ అదేబాట‌లో... 
- ఈ నెల 20వ తేదీ నుంచే శ్రీకారం

అమ‌రావ‌తి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌; ఏపీలో మళ్లీ వివాదాస్పద భూముల రీసర్వేకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి భూముల రీసర్వే చేపడతామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. గతంలో భూముల రీసర్వేపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.  ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కూడా దీన్ని కొనసాగిస్తే చోటు చేసుకునే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని 17 వేల గ్రామాలకు గానూ దాదాపు 7 వేల గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తయింది. దీర్ఘకాలంగా ఉన్న భూ వివాదాల పరిష్కారానికి కేంద్రం ఆదేశాలతో చేపట్టిన ఈ రీసర్వే క్షేత్రస్ధాయిలో పలు విమర్శలకు కారణమైంది. ఇందులో అధికారుల తప్పిదాలతో పాటు ప్రభుత్వం అనుసరించిన విధానాలు కూడా కారణంగా ఉన్నాయి. ఇదే అదనుగా అప్పట్లో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ జనంలోకి వెళ్లి భూముల రీసర్వేను ఆపాలంటూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. అప్పట్లో దీనికి తోడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు కూడా దీనికి తోడైంది. ఈ రెండింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లిన కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చాయి. అలాగే అధికారంలోకి రాగానే రద్దు కూడా చేశాయి. అయితే భూముల రీసర్వేను మాత్రం కొనసాగించక తప్పడం లేదు. కేంద్రం ఇప్పటికే ఈ సర్వేకు ప్రోత్సాహకంగా రూ.200 కోట్లు కూడా విడుదల చేసింది. దీంతో భూముల రీసర్వేను కొనసాగించక తప్పని పరిస్ధితి చంద్రబాబు సర్కార్ కు ఎదురవుతోంది. అయితే క్షేత్రస్ధాయిలో వివాదాలను ఇది పరిష్కరిస్తుందా లేక మరింత పెంచుతుందా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో భూముల రీసర్వే కొనసాగింపుకు వీలుగా ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ముందుగా మండలానికి ఓ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 200 నుంచి 250 ఎకరాల్లో రీ సర్వే చేయబోతున్నారు. ఇందులో ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ భూములు, నీటి వనరులు ఉన్న భూములు, పోరంబోకు భూములు కొలిచి సరిహద్దు రాళ్లు నాటబోతున్నారు. సర్వేలో భాగంగా భూ యజమానులతో పాటు చుట్టుపక్కన భూముల యజమానులకూ నోటీసులు ఇస్తారు. రెవెన్యూ సదస్సులు ముగిశాక పూర్తిస్ధాయిలో భూముల రీసర్వే ఉంటుంది.