Sidebar


Welcome to Vizag Express
ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదు

17-01-2025 19:16:32

ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదు 
-  ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం

విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యాకేజ్‌తో ఒరిగేదేమీ లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలంటున్న ఉక్కు పోరాట కమిటీ.. ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి కేంద్ర, రాష్ట్రాలకు లేదని మండిపడుతోంది. లాభాల్లో ఉన్న సంస్థపై నష్టాల పేరుతో కుట్రలు చేస్తున్నారని.. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు నిలదీస్తున్నాయి.  విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్రకటించిన సాయం పై సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం అరకొరగా స్పందించిందని.. అరకొర చర్యలతో విశాఖ ఉక్కుకు ఒరిగేదేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రూ. 11,500 కోట్లు ప్యాకేజీ ప్రకటించి.. అందులోనే 10,300 కోట్లు బాండ్ల విముక్తికి ఇస్తామనడం సరికాదు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలంటే సెయిల్‌లో విలీనం చేయాల్సిందే. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు క్యాపిటివ్ మైన్స్ ఇచ్చి ప్రోత్సహించడం సరికాదు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించడం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకమే’’ అని రామకృష్ణ స్పష్టం చేశారు.