విద్యుత్ సౌకర్యం కల్పించాలి
17-01-2025 19:19:03
విద్యుత్ సౌకర్యం కల్పించాలి
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి,17:
దొరగూడ గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని సర్పంచ్ కే త్రినాథ్ అన్నారు. మండలంలో అతి మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామంలో గురువారం ఆయన సందర్శించారు. ఉబ్బేంగుల నుండి దొరగూడ వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర నిర్మాణ దశలో ఉన్న సంక్షేమ శాఖ డబ్ల్యు బి ఎం రోడ్డును ఆయన పర్యవేక్షించారు. ఈ మేరకు స్థానికులతో మాట్లాడుతూ వారి ప్రధానమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు దొరగూడ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేక స్థానికులు చీకటిలోనే జీవనం గడుపుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ఇదివరకే గ్రామంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయని రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాగానే కమ్యూనిటీ సెంటర్ నిర్మాణ పనులు చేపడుతారన్నారు. గ్రామంలో అంగన్వాడి, పాఠశాల, భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని భవనాలు లేక చిన్న పిల్లలు చదువుకునే వయసులో చదువుకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గ్రామం కావడంతో ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా వెనకబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకం ద్వారా ఉపాధి పనులు కల్పించాలని ఆయన కోరారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత అధికారులతో సంప్రదించి సమస్యలు పరిష్కారం దిశగా తమ వంతు కృషి చేస్తానని ఆయన గ్రామస్తులతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత, వి సాదురం, ఉప సర్పంచ్, ఏ సత్యం లతోపాటు స్థానికులు కే లక్ష్మణ్, కే సోమర, వి సురేష్, తదితరులు పాల్గొన్నారు.