ప్రశాంతమైన గాయత్రి విద్యా పరిషత్ ప్రాంగణంలో చాగంటి ప్రవచనాలు ప్రారంభం... భారీ సంఖ్యలో భక్తులు.
మధురవాడ, వైజాగ్ ఎక్స్ప్రెస్ :
విశాఖపట్నంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త 'ప్రవచన చక్రవర్తి' బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు చే సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములు శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. కొమ్మాదిలోని గాయత్రీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన ఈ ప్రవచనములు 42 రోజులపాటు కొనసాగుతాయి. ప్రవచనములో శ్రీ రామాయణము వైభవము, వాల్మీకి మహర్షి గొప్పతనము, నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పిన సంక్షేప రామాయణముశ్రీ రామాయణ ఆవిర్భావ ఘట్టములను గూర్చి శ్రీ చాగంటి వారు ప్రవచించారు. శ్రీ రామాయణం మనిషిని సంస్కారవంతముగా తీర్చిదిద్దుతుందని, మానవ జీవితంలోని మౌలిక విలువలు, నీతి నియమములు మనందరికీ నేర్పించడానికి రామాయణం కన్నా గొప్ప కావ్యం లేదని చాగంటి తెలియజేసారు. శ్రీ రాముని నడవడియే ధర్మమని, మనుష్యునిగా నడయాడిన శ్రీ రాముడు తన జీవితములో గురువు వైభవమును తెలియజేస్తుంద ని వివరించారు. తాను చదువుకుని, ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన విశాఖపట్నం నగరములో మూడవమారు సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనం చేయటం శ్రీ రామానుగ్రహమని శ్రీ కోటేశ్వర రావు తమ సంతోషమును వ్యక్తం చేసారు.
ఈకార్యక్రమంలో గాయత్రీ విద్యాపరిషత్ కార్యదర్శి సోమరాజు కార్యక్రమ నిర్వాహకులు అష్టలక్ష్మి దేవాలయ ధర్మకర్తలు శ్రీ అన్నంరాజు సత్యనారాయణమూర్తి దంపతులు, భీమిలి ఎంఎల్ఏ గంటా శ్రీనివాస రావు పుర ప్రముఖులు, అనేకమంది భక్తులు విద్యార్థులు పాల్గొన్నారు.. భారీ సంఖ్యలో రాముడుభక్తులు పాల్గొన్నారు.