గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
25-01-2025 22:44:52
గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
పార్వతీపురం,వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 25:
నేడు స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో జరగబోయే 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వేదికతో పాటు ఆవరణ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేడు ఉదయం 9.00గం.లకు ముఖ్యఅతిథి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ చే జాతీయ పతాక ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. పోలీసుల కవాతు, మార్చ్ ఫాస్ట్ తదుపరి జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ సందేశం చదివి వినిపిస్తారు. అనంతరం పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు,జిల్లా ప్రగతిని చాటి చెప్పేలా వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాల పంపిణీ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసేలా ఎగ్జిబిషన్ తదితర కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. జిల్లా కలెక్టర్ కు పోలీసు వందన సమర్పణతో కార్యక్రమం ముగియనుంది. వేడుకలకు వచ్చే అతిధులకు, ఆహుతులకు కుర్చీలు, తాగునీరు, ఇతర ఏర్పాట్లను చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు.