Sidebar


Welcome to Vizag Express
భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలి యువతకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్

27-01-2025 19:32:58

భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలి

యువతకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్

పార్వతీపురం,వైజాగ్ ఎక్స్ ప్రెస్,జ‌న‌వ‌రి 27 : ఆం.ప్ర. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించే జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందే యువత, వారి భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంకల్ప్ మెగా జాబ్ మేళా కార్యక్రమం ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాకు 282 మంది నిరుద్యోగ యువత ఇంటర్వ్యూలకు హాజరుకాగా, అందులో 68 మంది 24 కంపెనీలకు ఎంపికయ్యారు. అలాగే పీఎం ఇంటర్న్ షిప్ కింద శిక్షణ పొందిన 30 మంది నిరుద్యోగ యువతకు కలెక్టర్, ప్రభుత్వ విప్ తో కలిసి సర్టిఫికేట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందిన యువతకు, శిక్షణ పొందిన యువతకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఆం.ప్ర.రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగం పొందిన యువత చిన్న, పెద్ద ఉద్యోగాలనే తారతమ్యం లేకుండా చిత్తశుద్ధి, క్రమశిక్షణతో పనిచేయాలని హితవు పలికారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, వారి భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని తెలిపారు. తద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతారని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ తో కలిసి వీడివీకెల ద్వారా కుట్టు శిక్షణ పొందిన మహిళలకు కుట్టుమిషన్లను కలెక్టర్ పంపిణీ చేశారు.

ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నిరుద్యోగ యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని, అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆమె ఆకాక్షించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  కె.ఉషారాణి మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి సహకారంతో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. ఈ జాబ్ మేళాల ద్వారా కురుపాం నియోజకవర్గ పరిధిలోని యువత ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య, ప్రజా ప్రతినిధులు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జూనియర్ కళాశాల సిబ్బంది, నిరుద్యోగ యువత, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.