Sidebar


Welcome to Vizag Express
నడుస్తూ... బండి మీద వెళ్తూ

27-01-2025 19:34:25

నడుస్తూ... బండి మీద వెళ్తూ

గుమ్మిడిగెడ్డ ఆనకట్టును పరిశీలించిన ప్రభుత్వ విప్, జిల్లా కలెకర్ 

పార్వతీపురం,వైజాగ్ ఎక్స్ ప్రెస్ జ‌న‌వ‌రి 27: 
కురుపాం మండలం కరలగండ గ్రామంలోని గుమ్మిడిగెడ్డ ఆనకట్టను ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరితో కలిసి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సోమవారం పరిశీలించారు. గుమ్మిడి గెడ్డ ప్రాంతానికి సరైన రహదారి సౌకర్యం లేనందున ద్విచక్ర వాహనంపై కొంత దూరం ప్రయాణించి, అక్కడ నుంచి కాలి నడకన ఆనకట్ట ప్రాంతానికి చేరుకొని స్వయంగా పరిశీలించారు. ఆనకట్ట మరియు కాలువల స్థితిగతులు , మరమ్మతుల గురించి విప్ కలెక్టరుకు వివరించారు.సుమారు 3,500 ఎకరాల ఆయకట్టుతో సాగునీటిని అందించేందుకు 1970-80 దశకంలో గుమ్మిడిగెడ్డను నిర్మించారని,అయితే నాటి నుంచి దానికి ఎటువంటి నిర్వహణ లేకపోవడంతో సాగునీటితో పాటు కురుపాంలో తాగునీటిని కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గుమ్మిడిగెడ్డను మినీ రిజర్వాయరుగా మారిస్తే కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల పరిధిలోని 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు కురుపాం ప్రాంతానికి తాగునీరు లభించే అవకాశం ఉందన్నారు. ఈ విషయమై రూ.49 కోట్లతో అంచనాలతో గతంలో అనేక సార్లు ప్రతిపాదనలు చేసినప్పటికీ, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితిల్లో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని గుమ్మిడిగెడ్డ ప్రాంతాన్ని పరిశీలించి, వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఖరీఫ్ నాటికి ప్రస్తుత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని సరఫరా చేయుటకు కాలువలపై ఉన్న షట్టర్లను బాగుచేయడం, కాలువలపై శిధిలావస్థలో ఉన్న డ్రాప్ లను మరమ్మతులు చేయటం, కాలువలకు అవసరమైన చోట సిమెంట్ కాంక్రీట్ తో లైనింగ్ పనులు అవసరమని జలవనరులశాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు.  దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రాబోవు ఖరీఫ్ లో సాగునీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేయుటకు అత్యవసరమైన పనులను గుర్తించి వాటి అంచనాలను తక్షణమే సమర్పిస్తే, వాటిని ఉపాధి హామీ పథకంలో మంజూరుచేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 

ఈ పర్యటనలో ఉపకార్యనిర్వాహక ఇంజనీర్ డి.రవికుమార్, కురుపాం సబ్ డివిజన్ మరియు సహాయక ఇంజనీర్లు జి.వి.రఘు,జి.భావన, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.