Sidebar


Welcome to Vizag Express
అభివృద్ధి ప‌నుల‌తోనే సంప‌ద - అలా చేద్దామంటే ఖ‌జానాలో నిధులేవీ - గ‌త ఐదేళ్ల‌లో వ‌చ్చిన నిధులు జగ‌న్ ఏమి చేశారో చెప్పాలి

27-01-2025 19:40:18

అభివృద్ధి ప‌నుల‌తోనే సంప‌ద 

- అలా చేద్దామంటే ఖ‌జానాలో నిధులేవీ

- గ‌త ఐదేళ్ల‌లో వ‌చ్చిన నిధులు జగ‌న్  
  ఏమి చేశారో చెప్పాలి

-  సీఎం చంద్రబాబు


అమరావతి, వైజాగ్  ఎక్స్‌ప్రెస్‌;  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  అన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్‌ ఇచ్చిన రిపోర్టుపై సోమ‌వారం  సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్‌-2025 నివేదికపైనా సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.  ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే అభివృద్ధి పనులు సరిగా చేయలేం. ఇదే కొనసాగితే చివరికి బాధపడేది ప్రజలే. రాష్ట్ర, దేశ భవిష్యత్‌ కోసం అందరూ ఆలోచించాలి. అభివృద్ధి పనులపై నిధులు ఎక్కువ ఖర్చు చేయాలి. అభివృద్ధి పనుల వల్లే సంపద పెరుగుతుంది. అలాగని అప్పులు చేసి.. పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి.  గత ఐదేళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదు. తెచ్చిన అప్పులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆదాయం పెరగదు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కూడా ప్రస్తుతం కష్టంగా ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.

 అప్పుల పాపం వైసీపీదే...

‘‘2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.67 వేల కోట్లు అప్పులు తెచ్చారు. కానీ, ఆ రుణాలను కనీస స్థాయిలో కూడా అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించలేదు. రాష్ట్ర ఆదాయం కూడా 17.1 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గిపోయింది. అప్పులు 16.5 శాతం మేర పెరిగాయి. వడ్డీ కట్టే మొత్తం కూడా 15శాతం పెరిగింది. ఇవి కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా పెద్ద మొత్తంలో జరిగాయి. వైకాపా హయాంలో ఎక్కువ వడ్డీకి అప్పులు తేవడం, మూల ధన వ్యయం లేకపోవడం, పన్నులు పెంచడం లాంటి వివిధ అంశాల వల్ల ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది.

ప్రాజెక్టులేవీ...?

2022-23లో రూ.7,244 కోట్లు మూలధన వ్యయం చేశారు. ఒక్క జలవనరు ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. 2014-19తో పోలిస్తే గత ఐదేళ్లలో మూల ధన వ్యయం 60శాతం మేర తగ్గిపోయింది. ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌లో ఏపీ 18వ ర్యాంకులో ఉంది. వృద్ధి రేటు లేకపోవడం వల్ల రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఏటా రూ.76 వేల కోట్ల ఆదాయం పోయింది. అందుకే రాష్ట్రానికి వృద్ధి రేటు అనేది చాలా ముఖ్యమని మా ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. తలసరి ఆదాయంలో కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజల కొనుగోలు స్థితి కూడా తగ్గింది.  ఆర్థిక రంగంలో సుస్థిరత వస్తేనే రాష్ట్రం గాడిన పడుతుంది. వైకాపా హయాంలో తలసరి ఆదాయం పెరగలేదు. కానీ, తలసరి అప్పు పెరిగింది. గాడిన పెట్టడానికి కొంచెం ఆలస్యం అవుతోంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతోపాటు మెరుగైన పాలన అందిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.