రామాయణం గురువు గొప్పతనాన్ని తెలియజేస్తుంది --- బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు.
మధురవాడ, వైజాగ్ ఎక్స్ప్రెస్:
శ్రీరామాయణ మహాకావ్యము గురు శిష్య సంబంధమునకు పట్టాభిషేకము చేస్తుందని, గురువుకు శిష్యుని పట్ల గల వాత్సల్యము, శిష్యునకు గురువు పట్ల ఉండవలసిన గురి, గౌరవము, నిబద్ధతలను గూర్చి ఎంతో గొప్పగా వివరిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారు వివరించారు. కొమ్మాదిలోని గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనముల సందర్భముగా మూడవ రోజైన నేడు (27-01-2025) విశ్వామిత్ర మహర్షి గొప్పతనమును గూర్చి, దశరథ మహారాజు విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులను పంపించటము, తాటకాసంహారము, విశ్వామిత్రుని యాగమును రామ లక్ష్మణులు పరిరక్షించుట, మారీచుని తరిమికొట్టి సుబాహుని సంహరించు ఘట్టములను గూర్చి వారు ప్రవచనం చేశారు.
వశిష్ట మహర్షి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నలకు విద్యాభ్యాసం చేయించినప్పుడు వారికి కేవలం విద్య నేర్పటము మాత్రమే కాకుండా తాము నేర్చుకున్న విద్య స్వప్రయోజనం కొరకు మాత్రమే కాకుండా లోక సంరక్షణ కొరకు, సమాజ ప్రయోజనము కొరకు ఎట్లా ఉపయోగించాలో నేర్పించారని, దానివలననే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నలు అంత గొప్ప శీలవంతులయ్యారని కోటేశ్వర రావు గారు వివరించారు. ఇటువంటి సంయమనం మరియు విలువలతో కూడిన విద్యాభ్యాసము వలన విద్యార్థులు సమాజమునకు ఉపయోగపడేవారిగా తయారౌతారని, ఆ విద్యాభ్యాసము ఎప్పటికీ ఆదర్శప్రాయం అని శ్రీ చాగంటి వారు తెలియజేసారు.
దశరథ మహారాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపించుటకు సందేహించినప్పుడు వశిష్ట మహర్షి విశ్వామిత్రుని గొప్పతనమును తెలియజేస్తూ ఆయన సకల విద్యాపారంగతుడని, ఆయనకు తెలియని అస్త్రశస్త్రములు లేవని, ఆయన కొత్త అస్త్రములను కూడా సృజించగలవాడని, అంతటి మహితాత్ముని వెనుక రాముని పంపటానికి ఆలోచించవద్దని బోధించారు. అంతటి మహానుభావులైన విశ్వామిత్ర
విశ్వామిత్ర వశిష్టుల వంటి గురువుల వద్ద విద్యాభ్యాసము చేయటమే రాముని అంత ఆదర్శవంతమైన పురుషునిగా చెక్కిందని శ్రీ చాగంటి వారు తెలియజేశారు. అందుచేతనే ప్రతీ మనిషి జీవితంలోనూ గురువు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తారని వారు ప్రవచించారు.