అర్జీలు పునరావృతం కాని విధంగా అధికారులు పరిష్కరించాలి
*జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్
విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 27 : ప్రజా సమస్యల పరిష్కార వేదిక "పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్" లో వచ్చిన అర్జీలను వెంటనే ఓపెన్ చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాని విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ జిల్లా అధికారులను ఆదేశించారు. "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను వింటూ, అర్జీలను స్వీకరిస్తూ, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జి వి ఎమ్ సి అడిషనల్ కమిషనర్ వర్మ, హౌసింగ్ పి డి సత్తిబాబు వినతులు స్వీకరించారు.
సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 264 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 130 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 15, జీవీఎంసీ సంబంధించి 59 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 60 వినతులు వచ్చాయి. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.