లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 27 :
లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఫలితాలు వెల్లడించడం నేరమని జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ సలహా మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లల తక్కువ జననాలు సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, హిరమండలం, సంతబొమ్మాలి మండలాల్లో నమోదవుతున్నాయని వెంటనే ఆయాచోట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గడిచిన మూడు నెలల కాల పరిధిలో రిజిస్ట్రేషన్, అబార్షన్, డెలివరీలు పరిశీలించి కారణాలు తెలుసుకోవాలని, ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. ప్రతి స్కానింగ్ సెంటర్ ఫారం ఎఫ్ తప్పకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల బాలికలు ఇద్దరూ సమానమేనని, ఆడపిల్లలు పుట్టడం ఒక వరమని ప్రతి ఒక్కరూ గ్రహించాలని అన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టీవీ బాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 114 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన పది స్కానింగ్ కేంద్రాలు మినహా మిగిలిన అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయని, ఆయాచోట్ల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాధ రావు మాట్లాడుతూ ప్రతి గర్భిణికి ప్రసవానికి ముందు అనంతరం ప్రభుత్వం అందజేసే ప్రోత్సాహకాలను గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. అవగాహన లేమి కూడా స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో పెద్ద ఎత్తున తేడాలు రావడానికి కారణమని చెప్పారు. ఎచ్చెర్ల మండలంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సమావేశంలో అదనపు డిఎంహెచ్వో టి. శ్రీకాంత్, రిటైర్డ్ జిల్లా జడ్జి పప్పల జగన్నాధ రావు, ఐసిడిఎస్ పిడి బి.శాంతి శ్రీ, కమిటీ సభ్యులు వైద్యులు రాజేష్ కుమార్ ప్రధాన్, పి.స్వర్ణలత, విద్యాసాగర్, వివిధ ఎన్జీవో సంఘాల తరపున ఆర్ .శ్రీనివాసరావు, మంత్రి వెంకటస్వామి, రమణమూర్తి, డిఐఓ రామదాసు, డీపీఎంవో బి.రవీంద్ర, డెమో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.