*రథ సప్తమి ఉత్సవాల్లో పిల్లల సంక్షేమానికి పూర్తి ప్రాధాన్యత కల్పించండి
*రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 27: వచ్చేనెల నాలుగున అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిర్వహించనున్న రథసప్తమి వేడుకల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తగినన్ని ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులకు,జిల్లా ఉన్నతాధికారులకు తమ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు సారధ్యంలో తాము వివిధ సూచనలు, ఆదేశాలు జారీచేస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఏపిఎస్సిసిఆర్) సభ్యులు గొండు సీతారాం చెప్పారు.
సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సీతారాం మాట్లాడుతూ క్యూలైన్లలో తల్లులు పాలుపెట్టే ప్రత్యేక కేంద్రాలు, గర్భిణీ, బాలింతలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, దివ్యాంగ బాలల హక్కుల ఉల్లంఘనలు జరగకుండా దర్శన ఏర్పాట్లు,ట్రై సైకిళ్ళు ఏర్పాటు చేయాలని సూచించారు, చిన్న పిల్లల వైద్యులుండేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వేడి పాలు, బిస్కెట్లు విరివిగా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
అలాగే స్త్రీ,శిశు సంక్షేమ,1098 చైల్డ్ లైన్,కార్మిక శాఖ అధికారులు,సిబ్బంది సమన్వయంతో బాల కార్మికులు, బాలయాచకులు లేకుండా, తప్పిపోయిన పిల్లలను త్వరితగతిన తల్లిదండ్రుల చెంతకు చేర్చేలా ముందస్తు ప్రణాలికలు రూపొందించుకొని బాలల హక్కుల ఉల్లంఘనలు, వారి సంక్షేమానికి పెద్ద పేట వేసి రథసప్తమి వేడుకలు విజయవంతం చేయాలని సీతారాం సూచించారు.