సత్ప్రవర్తన లేని క్రీడాకారులను బహిష్కరిస్తాం
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి28:
పట్టణ హాకీ క్రీడాకారుడు మళ్ళ రూపేష్ ను హాకీ సంఘం నుంచి తొలగిస్తున్నట్టు అనకాపల్లి జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు, రాంబాబు,కార్యదర్శి నరేష్ లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యలమంచిలి హాకీ క్రీడా చరిత్రకు మచ్చ తెచ్చిన సంఘటనకు కారణమైన హాకీ క్రీడాకారుడు మళ్ళ రూపేష్ ను హాకీ సంఘం నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నామన్నారు. రాష్ట్ర హాకీ సంఘం ఆదేశాల మేరకు లైంగిక ఆరోపణలలో అరెస్టు కాబడిన మళ్ళ రూపేష్ పట్ల హాకీ సంఘం ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని,అదేవిధంగా తోటి క్రీడాకారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడడం క్రమశిక్షణా రాహిత్యమన్నారు. అటువంటి చర్యలను హాకీ సంఘం తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే ప్రవర్తన కనిపించిన ఏ క్రీడాకారులైన హాకీ నుండి బహిష్కరిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా బాధిత క్రీడాకారిణికి హాకీ సంఘం అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు.
ఈ సమావేశంలో రాజా తదితరులు పాల్గొన్నారు.