పత్రికా ప్రకటన
పనితీరు మెరుగుపడకపోతే వేటు తప్పదు
పిఆర్ ఇంజనీర్లపై మండిపడ్డ కలెక్టర్
ఏపిఎంలపైనా తీవ్ర ఆగ్రహం
నలుగురిపై చర్యలకు ఆదేశం
ఉపాధిహామీ పనులపై కలెక్టర్ సమీక్ష
విజయనగరం, జనవరి 29 ః
పంచాయితీరాజ్ ఇంజనీర్లు, ఉపాధిహామీ ఏపిఎంలు, ఎపిడిలు తమ పనితీరును మెరుగుపర్చుకోకపోతే సస్పెషన్ వేటు వేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. ఇన్నాళ్లూ హెచ్చిరికలకే పరిమితం అయ్యామని, ఇకనుంచీ చర్యలు మొదలు పెడుతున్నామని ప్రకటించారు. ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు, గోకులాలు, పనిదినాల కల్పనపై కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారీగా ఫేజ్1,2,3 పనులపై సమీక్షించారు. అద్వాన్నంగా పనితీరును కనబరిచిన అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బొబ్బిలి పిఆర్ ఏఈ, సంబంధిత డిఈ, ఇద్దరు ఏపిఎంలకు షోకాజ్ నోటీలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ క్రింద సుమారు 280 కోట్ల విలువైన సిసి, బిటి రోడ్లు, డ్రైన్లు తదితర 2,851 పనులను 3 దశల్లో మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. వీటిలో 1171 పనులను మాత్రమే నేటివరకు పూర్తి చేయడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. మూడు నెలల్లో కేవలం 40 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారని, నిధుల వినియోగం మరింత అద్వాన్నంగా ఉందని అన్నారు. జిల్లాకు అందుబాటులో ఉన్న రూ.330 కోట్ల రూపాయలను పూర్తిగా వినియోగించుకొని, రోడ్లు కాలువలు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతే, వచ్చే ఏడాది నిధులు తగ్గిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ జిల్లా ప్రజలు నష్టపోకూడదని ఆదేశించారు. వారం వారం లక్ష్యాలను నిర్దేశించి, వాటిని పర్యవేక్షించాలని సూచించారు. ఏఈలుగా ఇన్‌ఛార్జిలు ఉన్నచోట, వారి స్థానంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లను నియమించాలని సూచించారు. పనిదినాల కల్పనలో కూడా జిల్లా వెనుకబడి ఉండటం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేపటినుంచి ప్రతీ గ్రామంలో ఉపాధి పనులు జరగాల్సిందేనని, ప్రజలకు విస్తృత స్థాయిలో పని కల్పించాలని, వంద రోజుల పని కల్పన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకనుంచీ ఈ పనులపై ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా సమీక్షిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా జిల్లాలో మంజూరైన గోకులాలు అన్నీ పూర్తి కావాల్సిందేనని, లేదంటే చర్యలకు సిద్దంగా ఉండాలని ఏపీఎంలకు స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నిటినీ రేపు సాయంత్రం లోగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో పంచాయితీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాస్, డ్వామా పిడి ఎస్.శారదాదేవి, ఇతర అధికారులు, ఇంజనీర్లు, ఏపిడిలు, ఏపిఎంలు పాల్గొన్నారు.