టీడీపీ కీలక పదవుల్లో మార్పులు , చేర్పులు
- పొలిట్ బ్యూరో, జాతీయం, రెండు రాష్ట్రాలలో కూడా
- సీనియర్లు, యువత కలగలిసి
- సుదీర్ఘ కాలం ఉండేవారికి స్థానచలనం
- లోకేష్, రామ్మోహన్ నాయుడులకు
బదులు కొత్తవారికి
- చంద్రబాబు అధ్యక్షతన కసరత్తు ఆరంభం
అమరావతి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్; తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళనకు రంగం సిద్దమైంది. కీలక పదవుల్లో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే సుదీర్ఘ కాలం పదవుల్లో కొనసాగుతున్న వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. మే లో పార్టీ మహానాడు జరగనుంది. ఈ లోగానే పార్టీ కొత్త పొలిట్ బ్యూరోతో పాటుగా జాతీయ, రెండు రాష్ట్రాల కమిటీల్లోనూ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పటికే పార్టీలో చర్చ మొదలైంది. పార్టీలో పదవుల ప్రక్షాళన టీడీపీ తాజాగా కోటి మంది సభ్యత్వం కలిగిన పార్టీగా రికార్డు సాధించింది. ఈ సమయంలోనే పార్టీ లో పదవుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లకు పదే పదే అవకాశం వస్తుండటంతో.. ఈ విధానంలో మార్పులు తెచ్చి పార్టీ కోసం పని చేసిన సామాన్యులకు గుర్తింపు ఇచ్చేలా పదవులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం పాలిట్ బ్యూరో తో పాటుగా జాతీయ కమిటీలోనూ సీనియర్లు - యువత కాంబినేషన్ లో కొత్త నియామకాల పైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. మూడు సార్లు వరుసగా పదవుల్లో ఉన్న నేతలను తప్పించటం ఖాయంగా కనిపిస్తోంది.
సీనియర్లకు పీఠం...
సీనియార్టీ - యువత పార్టీ పాలిట్ బ్యూరోలో ప్రస్తుతం చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, పూసపాటి అశోక్ గజపతి రాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు,కేఈ, చినరాజప్ప, సోమిరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నంద మూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల, ఎండీ షరీ ఫ్, బోండా, ఎన్‌ఎండీ ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, పితాని, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత,గుమ్మడి సంధ్యా రాణి, అరవింద్ కుమార్ గౌడ్ తో పాటుగా ఎక్స్ - అఫీషియో సభ్యలుగా నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్ ఉన్నారు. అదే విధంగా జాతీయ కమిటీలోనూ పలువురు సీనియర్లు కొనసాగుతున్నారు.
జాతీయ కార్యవర్గంలో...
జాతీయ కార్యవర్గంలో పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న లోకేశ్, రామ్మోహన్ నాయుడు తమ పదవులు వదులుకోవటానికి సిద్దమయ్యారు. వీరి స్థానంలో కమిటీలో కొత్త వారికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కాగా, లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. బాలకృష్ణ కు ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ కమిటీలో ముగ్గురు మహిళలు ప్రధాన కార్యదర్శు లుకా ఉన్నారు. ఇక, కొత్త కమిటీలో యువతకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రాంతీయ - సామాజిక సమీకర ణాలను బ్యాలెన్స్ చేస్తూ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకు ముందే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశమై మార్పులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో, పార్టీలో ఇప్పుడు పదవుల వ్యవహారం ఉత్కంఠ పెంచుతోంది.