పరస్పర సహకారంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు
*విద్యా సంస్థలు, పరిశ్రమల నిర్వహకులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం
విశాఖపట్టణం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 29; విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ సంస్థలు, పరిశ్రమల నిర్వాహకుల పరస్పర సహకారం, ప్రణాళికతో స్థానిక యువతకు పెద్ద యెత్తున ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం నిర్ణీత సమయంలో వచ్చేలా ప్రణాళికలు రచించాలని, ఉద్యోగ అవకాశాలకు తగ్గట్టు కోర్సులు అందించాలని ఆయా సంస్థలను కోరారు. ప్రభుత్వ సంస్థలు, ప్రయివేటు సంస్థలు సమన్వయంతో పని చేసి భవిష్యత్తులో స్థానిక యువతకు ఉపాధి మెరుగైన అవకాశాలను కల్పించాలని సూచించారు. ఇంటరాక్షన్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్ ఇన్ విశాఖపట్టణం రీజియన్ అనే పేరుతో కలెక్టరేట్ మీటింగు హాలులో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక పరిచయ సదస్సులో జిల్లా కలెక్టర్ పలు అంశాలపై మాట్లాడారు.
విశాఖపట్టణం జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను మెండుగా కల్పించాల్సి ఉందని, దానికి తగిన కార్యాచరణతో ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు నెలకొక్కసారి ప్రత్యేకంగా సమావేశం కావాలని, అవసరాలను గుర్తించి దానికి తగిన అభ్యర్థులను తయారు చేసుకోవాలని చెప్పారు. ఆయా కంపెనీల్లో అవసరాల మేరకు శిక్షణ అందించాలని చెప్పారు. ముందుగానే విద్యా, నైపుణ్య శిక్షణ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని తగిన కోర్సులు ప్రవేశ పెట్టేలా సంప్రదింపులు చేసుకోవాలని సూచించారు. తద్వారా కంపెనీల అవసరాలకు తగిన సిబ్బంది లభ్యమవుతారని పేర్కొన్నారు. విద్యా సంస్థలను, పరిశ్రమలను ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు, భవిష్యత్తు అవకాశాల గురించి యువతకు తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. దీని ద్వారా శిక్షణ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారం మార్పిడి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఉద్యోగాలిస్తాం... నైపుణ్యం కలిగిన వ్యక్తులను పంపండి
సమావేశంలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ సంబంధిత కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అయితే దానికి తగిన నైపుణ్యం కలిగిన వ్యక్తులను అందించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని అంశాల్లో నైపుణ్యం కలిగిన యువత స్థానికంగా లభ్యం కావటం లేదని, కంపెనీల అవసరాలకు సరిపడిన ఇంజనీర్లను తయారు చేసే కోర్సులు స్థానికంగా లేవని పలువురు సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై ఆంధ్రా యూనివర్శిటీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఐఐఎం విద్యా సంస్థల ప్రతినిధులు స్పందించారు. తగిన యువత మా వద్ద ఉన్నారని, అయితే వారికి ఉపాధి అవకాశాల గురించి తగిన సమాచారం లేకపోవటం వల్లనే కొంత ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. ఆయా కంపెనీల్లో ఉండే ఉద్యోగాలకు ఎలాంటి యువత కావాలో తెలిపితే... తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే సమావేశాలకు ఇదొక చక్కని ప్రారంభమని... దీని ఆధారంగా విద్యా సంస్థలు, శిక్షణ నైపుణ్య సంస్థలు, పరిశ్రమలు కలిసి పని చేయాలని, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
సమావేశంలో సీఐఐ ప్రతినిధులు మురళీ కృష్ణ, నీరజ్ సర్దా, గ్రంధి రాజేశ్, పీఎస్ ఠాగూర్, ఉపాధి కల్పనా అధికారి సుబ్బిరెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి, ఇతర విభాగాల అధికారులు, పలు ఐటీ, ఫార్మా, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులు, ఏయూ, ఐఐఎం, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు