శతాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం
31-01-2025 19:20:06
శతాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం
భీమునిపట్నం వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 31;భీమిలి ప్రభుత్వ పాఠశాల వందేళ్ల పండుగను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని శతాబ్ది ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు తెలియజేశారు. శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటి మరియు రెండవ తారీఖులలో భీమిలి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రంగ రంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఇందులో పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుత విద్యార్థులు కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి మొదటి నుంచీ పూర్తి సహకారం అందజేస్తున్న స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఇదివరలో ఇక్కడ పనిచేసిన గురువులను, ఇక్కడ చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్న పూర్వ విద్యార్థులను తగు విధంగా సత్కరించడం జరుగుతుందని చెప్పారు. శతాబ్ది ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మైలపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించగలుగుతున్నామని, పూర్తి సహకారం అందజేస్తున్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖాధికారులతో పాటు భీమిలి ప్రభుత్వ పాఠశాల సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆయన పూర్వ విద్యార్థినీ విద్యార్థులందరినీ పత్రికా ముఖంగా ఆయన కోరారు. శతాబ్ది ఉత్సవ కమిటీ కన్వీనర్ మైలపల్లి షణ్ముఖరావు మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వ పాఠశాలలో వందేళ్ల పండుగకు గుర్తుగా నిర్మించిన పైలాన్ ప్రారంభోత్సవంతో కార్యక్రమం ప్రారంభం అవుతుందని, తదుపరి ప్రస్తుత మరియు పూర్వ విద్యార్ధుల భీమిలి పుర వీధుల్లో ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. భీమిలి సముద్ర తీరంలో గల మన భీమిలి పార్కు లో శతాబ్ది ఉత్సవాల గుర్తుగా పద్మ విభూషణ్ సర్ రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని, తరువాత ఊరేగింపు భీమిలి చిన్న బజార్ మీదుగా ప్రభుత్వ పాఠశాల చేరడంతో తొలిరోజు కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకి భీమిలి సెయింట్ ఆన్స్ పాఠశాల మైదానంలో పూర్వ విద్యార్ధులకి ఆటల పోటీలు నిర్వహిస్తామని, వాటి తరువాత ఉదయం పది గంటల నుంచి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సాంస్కృతిక, సత్కార, పరిచయ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. మధ్యాహ్నం అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోడానికి శతాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులందరూ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో శతాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు మాదా పార్వతీశం, కాళ్ళ సన్నీ, కంటుభుక్త ముత్యాలరావు, టి భీమారావు, అత్తిలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.