Sidebar


Welcome to Vizag Express
విద్యా సంవత్సరం ప్రారంభంలోపే టీచర్ల భర్తీ

31-01-2025 19:42:18

విద్యా సంవత్సరం ప్రారంభంలోపే టీచర్ల భర్తీ 

- డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌ కీలక ప్రకటన
-  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్‌

అమ‌రావ‌తి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;  ఏపీ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీపై  సీఎం, మానవవనరుల శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల కోడ్‌ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోపే టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పందించారు. ఏపీలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో కూటమి నేతలతో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు ఏవైనా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్‌ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 80 శాతం టీచర్ల నియామకం చేపట్టింది టీడీపీనే అని తెలిపారు. టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకంగా డీఎస్సీని ప్రకటిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం 6100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు డీఎస్సీ ప్రకటన అందని ద్రాక్షలాగే మారింది.