Sidebar


Welcome to Vizag Express
అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు

31-01-2025 19:43:27

అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు 

- ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల
-    ఈ విషయం నీతిఆయోగ్‌ తేల్చింది
 -   తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు వచ్చే ఏడాదే
 - తేల్చేసిన‌  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల

అనంత‌పురం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;  ఏపీకి అప్పు తీసుకునే శక్తితోపాటు తీర్చే శక్తి కూడా లేదని తేల్చి సున్నా మార్కులు వేసింది’ అని రాష్ట్ర  ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.అనంతపురం జిల్లా ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నీతిఆయోగ్ దేశంలోని 18 రాష్ట్రాల  ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో మన రాష్ట్రం 17వ స్థానంలో ఉంది.  దేశం మొత్తమ్మీద అప్పు తీసుకునే అర్హత లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని నీతిఆయోగ్ తేల్చించింద‌న్నారు. అయితే తాము అప్పులు ఉన్నాయని సాకు చూపి తప్పించుకోలేమని, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు.  

వచ్చే ఆర్థిక సంవత్సరంలో...

వచ్చే ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు.   ఆర్థిక భారం ఉన్నా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి చూపుతామన్నారు. రాయలసీమ బాగుపడాలంటే నీళ్లు రావాలని, నీళ్లు రావాలంటే పోలవరం పూర్తి కావాలన్నారు.  పోలవ­రం పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కాగానే జిల్లాల మధ్య నీటి యుద్ధాలు ఆగిపోయాయన్నారు. రాయలసీమలో లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే ప్రణాళికతో చంద్రబాబు ముందుకు వెళుతున్నారన్నారు. కేంద్రం అమరావతి నిర్మాణానికి  ఆర్థిక సాయం చేయడంతో పాటు  రైల్వే ప్రాజెక్టులపై రూ.90 వేల కోట్లు, జాతీయ రహదారులకు రూ.60 వేల కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. ఇవన్నీ పూర్తయితే సంపద సృష్టి జరిగి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. సంపద సృష్టి అంటే ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ మరోవైపు పథ­కాలు ముందుకు తీసుకుపోవడమేనని చెప్పారు.