రథసప్తమి సంబరాలకు సర్వం సిద్ధం
.జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31: అరసవల్లి రథసప్తమి వేడుకలకు చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమవుతాయని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 80 అడుగుల రోడ్డులో సుమారు మూడు వేల మందితో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహిస్తామని, వేడుకల ప్రారంభం రోజు శోభాయాత్ర ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలతో పాటు గ్రామీణ క్రీడలైన కర్రసాము, సంగీడీలు, ధాన్యం గోనెలు ఎత్తడం, వెయిట్ లిఫ్టింగ్ వంటి పోటీలు నిర్వహిస్తారని, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కోలాటం, తప్పెగుళ్లు, చెంచు భాగోతం, చెక్కభజన, తుర్పు భాగవతం, తాలీ ఖానా, నాద స్వరం, డప్పు వాయిద్యం, గిరిజనుల ధింసా నృత్యం, నేలవేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంటూ వాటి ఏర్పాట్లపై చర్చించారు. తొలిసారి జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు.
ప్రముఖ సంగీత విద్వాంసుడు గణపతి శర్మ, నీరజా సుబ్రమణ్యం, శ్రీకాంత్ బృందాలతో డ్యాన్సులు, సంప్రదాయ నృత్యాలు, గాయని మంగ్లీతో ఆర్కెస్ట్రా వంటి ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి అవసరమైన రవాణా, వైద్య, భోజనం, వసతి సదుపాయాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుభ్యం, మంచి నీరు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీవోలు సాయి ప్రత్యూష, కృష్ణ మూర్తి, డీఎస్పీ సిహెచ్ వివేకానంద, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, డీఎస్‌డీఓ శ్రీధర్, పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ పి. సుగుణాకర రావు తదితరులు పాల్గొన్నారు.