Sidebar


Welcome to Vizag Express
రూ. 50,65,345 కోట్లతో బడ్జెట్ - రూ.12 లక్షలలోపు ఆదాయానికి పన్ను మినహాయింపు

01-02-2025 17:39:32

రూ. 50,65,345 కోట్లతో బడ్జెట్ 

- రూ.12 లక్షలలోపు ఆదాయానికి పన్ను మినహాయింపు

ఢిల్లీ, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌; కేంద్ర ఆర్దిక మంత్రి 2025- 26 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించారు. ఈ బడ్జెట్ లో కీలక శాఖలకు గతం కంటే కేటాయింపులు పెరిగాయి. మొత్తం రూ. 50,65,345 కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించారు. రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక, విద్యా - మౌలిక వసతులు, ఇన్ ఫ్రా రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్రానికి అధికంగా వరాలు ప్రకటించారు. బడ్జెట్ లో ఆదాయ - అప్పుల లెక్కలను వెల్లడించారు.

కేటాయింపులు ఇలా...

బడ్జెట్ లో ప్రధాన రంగాలకు కీలక కేటాయింపులు చేసారు. రక్షణ రూ. 4,91,732 కోట్లు, గ్రామీణా భివృద్ది రూ. 2,66,817 కోట్లు, హోం రూ. 2,33,211 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు, విద్య రూ. 1,28,650 కోట్లు, ఆరోగ్య రూ. 98,311 కోట్లు, పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు, ఐటి, టెలికం రూ. 95,298 కోట్లు, విద్యుత్‌ రూ. 81,174 కోట్లు, వాణిజ్య - పరిశ్రమలు రూ. 65,553 కోట్లు, సామాజిక సంక్షేమం రూ. 60,052కోట్లు, వైజ్ఞానికి విభాగాలకు రూ. 55,679 కోట్లు నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.

ఆదాయం ఇలా...

ఇక, ఆదాయపన్ను నుంచి 22 శాతం నుంచి ఆదాయం వస్తుందని ఆర్దిక మంత్రి తన బడ్జెట్ లో ఆశాభావం వ్యక్తం చేసారు. అదే విధంగా కేంద్ర ఎక్సైజ్‌ నుంచి 5 శాతం వస్తుందని.. జీఎస్టి, ఇతర పన్నుల నుంచి 18 శాతం వస్తుందని అంచనాగా వెల్లడించారు. కార్పొరేషన్‌ పన్ను ద్వారా 17 శాతం వస్తుందని పేర్కొన్నారు. కస్టమ్స్‌ ద్వారా... 4 శాతం, అప్పులతో కాని క్యాపిటల్‌ రిసిప్ట్స్‌ ద్వారా 1 శాతం అంచనా వేయగా.. పన్నేతర ఆదాయం 9 శాతం..వీటితో పాటుగా అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24 శాతం ఆదాయం సమకూరుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఖర్చుల లెక్క...

2025-26 కాలానికి కేంద్ర ఖర్చులను బడ్జెట్ లో వెల్లడించారు. వడ్డీ చెల్లింపులకు 20 శాతం మేర ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 శాతం ఖర్చు గా ప్రతిపాదించారు. అదే విధంగా కీలక సబ్సిడీలకు 6 శాతం, రక్షణ రంగానికి 8 శాతం, రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22 శాతం ఖర్చుగా పేర్కొన్నారు. ఫైనాన్స్‌ కమిషన్‌, ఇతర బదిలీల ద్వారా 8 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుందని.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం, ఇతర ఖర్చులకు 8 శాతం, పెన్షన్స్‌లకు 4 శాతం మేర ఖర్చు చేస్తున్నట్లు నిర్మలా సీతా రామన్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసారు.

వేతన జీవులకు భారీ ఊరట.. 

12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించింది. ఈ మేరకు పార్లమెంటులో బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ప్రకటన చేశారు.  శ్లాబులను కూడా తగ్గించామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు. రూ.20లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు. రూ.16 లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.70 వేల వరకు లబ్ధి చేకూరనుంది. అలాగే రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.1.10 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగానే టీడీఎస్‌, టీసీఎస్‌ రేట్లను కూడా కేంద్రం భారీగా తగ్గించినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వృద్ధులకు వడ్డీపై వచ్చే ఆదాయంపై రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు పెంచామని తెలిపారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో పెట్టబోతున్నట్లు  తెలిపారు. భారతీయ న్యాయ సంహిత్‌ చట్టం స్ఫూర్తితో ఆదాయపు పన్నుకు చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. ఆదాయపు పన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తామని చెప్పారు. బిల్లులో సులభతర విధానం తీసుకురాబోతున్నామని అన్నారు.