Sidebar


Welcome to Vizag Express
ఛత్తీసగఢ్లో భారీ ఎన్కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి

01-02-2025 17:40:32

ఛత్తీసగఢ్లో భారీ ఎన్కౌంటర్ 

-  8 మంది మావోయిస్టులు మృతి 

ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;   ఛత్తీసగఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బీజాపూర్ జిల్లా పోలీసులు అధికారికంగా ప్రకటించారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నట్లు తెలిసింది. గంగలూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం బలగాలు గాలిస్తున్నాయి. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. జనవరి 16న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఒక సీనియర్ పోలీసు అధికారి ఈ సమాచారం ఇచ్చారు. దక్షిణ బీజాపూర్ అడవుల్లో ఉదయం 9 గంటల ప్రాంతంలో భద్రతా సిబ్బంది సంయుక్తంగా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉన్నప్పుడు కాల్పులు ప్రారంభమయ్యాయని, సాయంత్రం వరకు కాల్పులు కొనసాగాయని ఆయన అన్నారు.ఈ ఆపరేషన్‌లో మూడు జిల్లాల నుండి రాష్ట్ర పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్  ఐదు బెటాలియన్ల కోబ్రా సిబ్బంది, సీఆర్పీఎఫ్ కు చెందిన 229వ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. జనవరి 12న బీజాపూర్ జిల్లాలోని మద్దీద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. గత ఏడాది రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు 219 మంది నక్సలైట్లను హతమార్చాయి. అంతకుముందు, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో నక్సల్ వ్యతిరేక గస్తీలో సైనికులతో పాటు వెళుతున్న సీఆర్పీఎఫ్ కుక్క ఐఈడీ పేలుడులో తీవ్రంగా గాయపడింది.