ప్రజలకు మేలు చేసే బడ్జెట్
. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
01-02-2025 17:41:39
ప్రజలకు మేలు చేసే బడ్జెట్
. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్; కేంద్ర బడ్జెట్ 2025-26 పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ బడ్జెట్ లో కేటాయింపుల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. బీహార్ లో ఎన్నికలు ఉండటంతో ఆ రాష్ట్రా నికి భారీ వరాలు బడ్జెట్ లో ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో ఏపీ ప్రస్తావన చేయకపోవటం పై కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం గత ఏడు నెలల కాలంలో ఏపీకి అందించిన సాయం గురించి చర్చ జరుగుతోంది. దీంతో, బడ్జెట్ పైన సీఎం చంద్రబాబు తన అభిప్రాయం స్పష్టం చేసారు. కేంద్ర బడ్జెట్ లో పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులతో పాటుగా ఇతర రంగాలకు కేటాయిం పులు జరిగాయి. అయితే, ప్రత్యేకంగా ఆర్దిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో గత ఏడాది తరహాలో ఏపీ ప్రస్తావన లేదు. బడ్జెట్ పైన చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. బడ్జెట్ ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ విజన్‌ను ప్రతిబింభించేలా బడ్జెట్ ఉందని ప్రశంసించారు. ఈ బడ్జెట్ లో మహిళా, పేదల, యువత, వ్యవసాయదారుల సంక్షేమానికి బడ్జెట్ పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చారు. మధ్యతరగతి వర్గానికి ట్యాక్స్ రిలీఫ్, ఈ బడ్జెట్‌లో వచ్చిన అదనపు ప్రయోజనం గా పేర్కొన్నారు. ఆరు కీలక రంగాల్లో రానున్న అయిదేళ్ల కాలంలో అభివృద్ధికి ఈ బడ్జెట్ మార్గదర్శకం చేస్తుందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. బడ్జెట్ పైన మాజీ ఆర్దిక మంత్రి యనమల స్పందించారు. ఆర్థిక అసమానతలు, పేదరికం నిర్మూలన, స్థిరమైన ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉపాధి కల్పన వంటి ప్రధాన సవాళ్లను పరిష్కరించే ప్రయత్నం స్వాగతించదగినదని అభిప్రాయపడ్డారు. సామాన్యులు, రైతుల అంచనాలు కొంత మేరకు నెరవేరాయని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, సామాన్యుల ఆదాయానికి దోహదపడే తయారీ రంగాన్ని నెలకొల్పేందుకు మన రాష్ట్రానికి భారీ ఆర్థిక ప్రోత్సాహం లభించేలా బడ్జెట్ ఉందని తెలిపారు.