ఇక కేజీహెచ్ లో పేదలకు ఉచితంగా క్యాన్సర్ వైద్యం
40 కోట్లతో అందుబాటులోకి లేనాక్ మిషన్
ఇప్పటికే ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తి
మరో మూడు నెలల్లో రోగులకు సత్వర సేవలు
బ్రెయిన్ ట్యూమర్ రోగులకు వారంలోనే మెరుగైన వైద్యం
గతేడాది కాలంలోభారీగా పెరిగిన ఓపి,ఐపి సేవలు
కే జి హెచ్ సూపర్డెంట్ డాక్టర్ పి. శివానంద
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఇకపై కింగ్ జార్జ్ ఆసుపత్రిలో సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్. పి శివానంద తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణ బాబు, డిఎంఈ నరసింహులు సూచనలు, సలహాలు పాటిస్తూ కేజీహెచ్ ఆసుపత్రిలోని సమగ్ర క్యాన్సర్ విభాగం ద్వారా మెడికల్ ఆంకాలజీ,రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ మూడు విభాగాల్లో రోగులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. గతేడాదిలో కేజీహెచ్ లో ఈ మూడు విభాగాలకు సంబంధించి భారీగా ఓపి,ఐపి మైనర్, మేజర్ సర్జరీలు జరిగినట్లు వారు తెలిపారు. ముఖ్యంగా మెడికల్ ఆంకాలజీ విభాగ అధిపతి డాక్టర్ కే. శిల్ప, రేడియేషన్ ఆంకాలజీ విభాగధిపతి డాక్టర్ పాండురంగ కుమారి,సర్జికల్ ఆంకాలజీ విభాగ అధిపతి డాక్టర్ నాయక్ ఆధ్వర్యంలో రోగులకు పూర్తిస్థాయిలో ఉచితంగా ఖరీదైన వైద్యం అందించడంతోపాటు లక్షలాది రూపాయలు విలువగల ఆపరేషన్లు కూడా సకాలంలో అందిస్తున్నట్లు సూపర్డెంట్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒడిస్సా, అండమాన్ నికోబార్ ప్రాంతాల నుంచి కూడా రోగులు కేజీహెచ్ లో క్యాన్సర్ వైద్య సేవలకు తరలివస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క రేడియేషన్ ఆంకాలజీ విభాగానికి ఏడాదికి ఎనిమిది వందల మంది వరకు చికిత్స పొందుతున్నట్లు ఆయా విభాగ అధిపతి డాక్టర్ పాండురంగకుమారి తెలిపారు. ఇప్పటివరకు రేడియేషన్ అవసరమైన రోగులకు కోబాల్ట్60 మిషన్ ద్వారా వైద్యం చేస్తున్నట్లు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందుబాటులో తెచ్చిన 40 కోట్ల విలువ గల లేనాక్ మిషన్ ద్వారా క్యాన్సర్ రోగులకు శరీరంలో ఏ ప్రాంతంలో క్యాన్సర్ కణాలు ఉన్న గుర్తించి వాటికి సకాలంలో వైద్య సేవలు అందించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ అడ్వాన్సుడ్ మిషన్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ వంటి రోగాలను సైతం వారం రోజులు వ్యవధిలోనే పూర్తిస్థాయిలో నయం చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఇదే వైద్య సేవలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే రెండు నుంచి పది లక్షల వరకు ఖర్చు అవుతుందని, కానీ కేజీహెచ్ లో మాత్రం పూర్తిగా ఉచితంగానే ఆయా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపర్డెంట్ శివానంద్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం 40 కోట్లతో విలువ చేసిన ఈ లేనాక్ మిషన్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ రోగులకు సేవలు అందించేందుకు మరో మూడు నెలల సమయం పడుతుందని పూర్తిస్థాయిలో మిషన్ రన్నింగ్లోకి వచ్చిన తర్వాత రోగులకు మరింత మెరుగైన వైద్య0 అందించనున్నట్లు తెలిపారు.
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామస్థాయి నుంచి ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామని గ్రామస్థాయిలో క్యాన్సర్ రోగులను గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందించిదుకే కేజీహెచ్ రిఫర్ చేస్తున్నారని, వారందరికీ కేజీహెచ్ లో అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు సూపర్డెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. వారంలో రెండు రోజులు పాటు ప్రత్యేకంగా ఓపి సేవలు నిర్వహించి రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ క్యాన్సర్ తో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ పై కూడా మహిళలకు పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని ఆసుపత్రికి వచ్చే ఇతర ప్రాంతాల నుంచి రోగులకు కూడా వైద్య సేవలతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.