Sidebar


Welcome to Vizag Express
సోనా సూద్ ఉదార‌త - నాలుగు అత్యాధునిక అంబులెన్స్‌లు అంద‌జేత‌

03-02-2025 20:16:40

సోనా సూద్ ఉదార‌త  

- నాలుగు అత్యాధునిక అంబులెన్స్‌లు అంద‌జేత‌

అమ‌రావ‌తి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;  ఏపీకి నాలుగు అత్యాధునిక అంబులెన్స్‌లను ప్ర‌ముఖ సినీ న‌టుడు సోనూసూద్ అందించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన అంబులెన్స్‌లను సోమ‌వారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం వాహనాలు అందించినందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం సోనూసూద్ మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్‌లో వైద్య‌ప‌రంగా అభివృద్ధి చేయడంలో మా వంతు కృషి చేస్తున్నా. చాలా మంది అంబులెన్స్‌లు కావాలని అడిగారు. అందుకే ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం వాటిని అందిస్తున్నా. ఏపీ ప్రజలు నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏపీ నా రెండో ఇల్లు లాంటింది. ఇక్కడి ప్రజలు నన్ను ఉన్నతస్థాయిలో నిలబెట్టారు. నా భార్య ఏపీకి చెందిన మహిళే. ఎవ్వరికీ ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటా. ప్రతి ఒక్కరూ గొప్పవారు అయ్యాక సమాజానికి సేవ చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. 

సామాన్యుడి కోసమే నా త‌ప‌న‌...

నటులు సైతం సినిమాల్లో నేమ్, ఫేమ్ సంపాదించాక తిరిగి సొసైటీకి ఎంతో కొంత ఇవ్వాలి. కొవిడ్ సమయం నుంచీ నేను చంద్రబాబుతో టచ్‌లో ఉన్నా.మొదటిసారిగా ఏపీకే అంబులెన్స్‌లు ఇచ్చా. నా ఫౌండేషన్ ప్రతి సామాన్యుడి కోసం పని చేస్తోంది. నేనూ సామాన్యుడిగానే ఉండాలని అనుకుంటా. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయ నాయకులు ఉన్నారు. సీఎంకు ఇప్పుడే నాలుగు అత్యాధునిక అంబులెన్స్‌లు ఇచ్చా. అందులో టాప్ ఫెసిలిటీలు ఉన్నాయి. మేము ఇచ్చే వాహనాలను నడపేందుకు డ్రైవర్లు కావాలి, మెయిన్‌టనెన్స్ చేయాలి. ఆ సపోర్ట్ ఏపీ ప్రభుత్వం నుంచి వస్తోంది. రాష్ట్రంలో వాటి అవసరం ఎవ్వరికి ఉన్నా వాడుకోవచ్చు. సీఎం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది చాలా మందిని ఇన్‌స్పైర్ చేస్తోందని చెప్పారు. సీఎం చంద్రబాబు నన్ను ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమంటే నేను రెడీ. తెలుగులో సినిమాలు చేయలేకపోవడానికి ఫతే సినిమా నిర్మాణంలో బిజీగా ఉండడమే కారణం. ఈ సినిమాకు సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నానని” చెప్పారు.