వేడుకగా సరస్వతీ పూజలు
03-02-2025 20:29:33
వేడుకగా సరస్వతీ పూజలు
ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 3
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఆలయాలు, విద్యాలయాలలో సరస్వతి పూజలు ఘనంగా జరిపారు. స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో కొలువై ఉన్న జ్ఞాన సరస్వతి పీఠం వద్ద సోమవారం మూడు విడతలుగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత జ్ఞాన సరస్వతికి అభిషేకం, అలంకరణ పూజలను అర్చకులు మూర్తి జరిపించారు. స్వర్ణ భారతి, శాంతినికేతన్, జ్ఞాన భారతి, శ్రీ వినాయక విద్యానికేతన్ లలో చాట్ల తులసీదాస్, దక్కత కృష్ణమూర్తి రెడ్డి, జోహార్ ఖాన్, జి కోకిల ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసాలు జరిపారు. పుర ఒరియా పాఠశాలలో ఒరియా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పోరా బాలికోన్నత పాఠశాల, పంజా వీధి పాఠశాలలో కూడా సరస్వతి విగ్రహాల వద్ద విద్యార్థులచే ప్రత్యేకంగా పూజలు జరిపించారు.