Sidebar


Welcome to Vizag Express
గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం -- 15 న శ్రీకాకుళంలో శ్రీకారం

03-02-2025 20:49:59

గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం
-- 15 న శ్రీకాకుళంలో శ్రీకారం 
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 3: స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా సాగిన గ్రంథాలయ ఉద్యమం మరోసారి ప్రభుత్వాల నిర్వాకాల వల్ల అవసరమైందని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. దీనికోసం గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం పేరుతో రాష్ట్రస్థాయిలో ఒక కార్యాచరణ ప్రణాళికను జనవరి 9వ తేదీన విజయవాడలో జరిగిన ఒక ప్రాథమిక సదస్సు ఖరారు చేసింది. ఈనెల 15వ తేదీన శ్రీకాకుళం నుంచి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని తీర్మానించింది. ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ తో పాటు ప్రముఖ రచయితలు, కవులు, ప్రచురణకర్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అభ్యుదయ రచయితల సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నల్లి ధర్మారావు, చింతాడ కృష్ణారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి స్థానిక సంస్థలు, పరిశ్రమలు గ్రంథాలయ సెస్ పేరుతో చెల్లిస్తున్న డబ్బును రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదారే పట్టిస్తున్నాయని, గ్రంథాలయ వ్యవస్థ దాదాపు నిర్వీర్యమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు జిల్లా గ్రంధాలయ సంస్థలు రచయితలను ప్రోత్సహించేవని, గ్రంథాలను కొనుగోలు చేసేవని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని వారు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లా గ్రంధాలయ సంస్థకు ఉన్న బకాయిలు కోట్ల రూపాయల లోనే కనిపిస్తున్నాయని తెలిపారు. గ్రంథాలయాల సెస్ ను గ్రంథాలయ సంస్థల అభివృద్ధికే వినియోగించాలని, కొత్త పుస్తకాల కొనుగోలు, ముద్రణను ప్రోత్సహించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రంథాలయ సంస్థ ఉద్యోగాలను భర్తీ చేయాలని కూడా కోరారు. శాఖ గ్రంథాలయాల మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలన్నారు. శ్రీకాకుళం నుంచి ప్రారంభమవుతున్న ఈ పునర్వికాస ఉద్యమానికి గ్రంథాలయాల పాఠకులు, సాహితీ సంస్థలు, మేధావి వర్గం ప్రతినిధులు అండదండలు ఇవ్వాలని, 15వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా గ్రంథాలయ సంస్థ దగ్గర జరిగే ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.