కోటపాడు సచివాలయంలో వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలు.
04-02-2025 21:28:40
కోటపాడు సచివాలయంలో వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలు.
కె. కోటపాడు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 4 : గ్రామ సచివాలయాల్లో సిబ్బంది నిల్ ... హాజరు పట్టిలో అటెండెన్స్ ఫుల్ అన్న చందంగా ఉద్యోగులు ఉన్నారు. ఏదైనా సమస్య చెప్పుకుందాం అన్నా.. దేనికైనా దరఖాస్తు చేసుకుందామన్నా.. ఒకరు కూడా అందుబాటులో ఉండటం లేదని పలువురు ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కె కోటపాడు గ్రామ సచివాలయం పరిస్థితి చూస్తే కార్యాలయంలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఇంటి పన్ను కడదామంటే కార్యదర్శి , గుమస్తా ఎవరు ఉండరు. రెవెన్యూ కు సంబంధించి ఏమైనా దరఖాస్తు చేద్దామంటే డిజిటల్ అసిస్టెంట్ ఉండరు. వెల్ఫేర్ , మహిళా పోలీస్ , ఇంజనీర్ , సర్వే , వీఆర్వో ఇంతమంది విధులు నిర్వహించవలసి ఉన్న ఎవరు ఆఫీసులో కనిపించడం లేదని ఆరోపించారు. మంగళవారం గ్రామ సచివాలయానికి అనేక పనులపై వచ్చిన పలువురు లబ్ధిదారులు ఇక్కడ పరిస్థితులను చూసి పెదవి విరిచారు. ఖాళీ కుర్చీలను ఫోటో తీసి స్థానిక విలేకరులకు అందజేశారు. ఉదయం ఎఫ్.ఆర్.సి వేసి వెళ్ళిపోతున్నారని ఆరోపించారు. తన భూమికి సంబంధించి మ్యూటేషన్ కు దరఖాస్తు చేయడానికి గత మూడు రోజుల నుండి తిరుగుతున్న ఎవరూ కనిపించడం లేదని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఆరోపించాడు. ఇక సామాన్య ప్రజలకు సేవలు ఎలా అందుతాయని ఆయన ప్రశ్నించాడు. ఈ విషయమై స్థానిక సచివాలయ కార్యదర్శి శ్రీను విలేకరులతో మాట్లాడుతూ.. మొత్తం సిబ్బందిలో ఇద్దరు మహిళా ఉద్యోగులు మెటర్నిటీ సెలవుపై వెళ్లారని , ఒకరు డిప్యూటేషన్ , ఇద్దరు పెన్షన్ వెరిఫికేషన్ , ఒకరు బ్యాంకు పని పై ఇంకొకరు ఇంటి పన్ను వసూలుకు వెళ్లడం జరిగిందన్నారు. కార్యాలయంలో ఎవరూ లేకపోవడం వాస్తవమేనని అంగీకరించారు.