వైభవంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి తీర్థ మహోత్సవం:
ఉత్సవాల్లో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న దంపతులు:
నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 4 :
నర్సీపట్నం మున్సిపాలిటీ శివపురంలో ఉన్న శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో 26వ సంక్రాంతి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆయన సతీమణి చింతకాయల పద్మావతి ఉత్సవాల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు,దంపతులను ఆలయ కమిటీ సభ్యులు పైల గోవిందు,మున్సిపల్ వార్డు కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు, దనిమిరెడ్డి బుజ్జి తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్పీకర్ అయ్యన్న దంపతులు అభయాంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తీర్థ మహోత్సవంలో భాగంగా,నూతన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం, శక్తి వేషాలు, విజయనగరం వారిచే ప్రదర్శించిన కాంతార వేషధారణలు ప్రజలను ఆకట్టుకున్నాయి. డైనమిక్ సూర్య వారిచే నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తీర్థ మహోత్సవాన్ని జయప్రదం చేశారు. పట్టణ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు