రాయపూర్ లో తెలుగు మహాసభలు మార్చి ,8 న
కన్వీనర్ రుద్రమూర్తి
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ప్రెస్ ,పిబ్రవరి 4:
ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర రాజధాని రాయపూర్ లో మార్చి 8, 9 తేదీలలో రెండు రోజుల పాటు ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర స్థాయి తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు మహాసభల కన్వీనర్ లండ రుద్ర మూర్తి తెలిపారు. మంగళవారం విజయవాడ బంకింగ్ హం పోస్టాఫీస్ ఎదురుగా గల ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మహాసభ వివరాలను రుద్ర మూర్తి వివరించారు. భిలాయి స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశ, రైల్వే విస్తరణ సమయంలో ఉపాధి కోసం తెలుగువారు ఛత్తీస్ గడ్ వచ్చారని, అలా వచ్చిన వారిలో ఉత్తరాంధ్ర, ఒంగోలు, నెల్లూరు, గోదావరి జిల్లాలకు చెందిన వారు ఉన్నారన్నారు. గత ఏడు దశాబ్దాలుగా తమ భాషా సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకొనే ప్రయత్నంలో స్థానికంగా తెలుగు సాంస్కృతిక, సాహిత్య, కుల, గ్రామ సంఘాలను ఏర్పాటు చేసుకొని, రామాలయాలు, బాలాజీ మందిరాలు, తెలుగు పాఠశాలలు స్థాపించుకున్నారని తెలిపారు. సంక్రాంతి, ఉగాది, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, మహాకవి గురజాడ, శ్రీశ్రీ, కందుకూరి, గిడుగు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తదితరుల జయంతి, వర్ధంతులను నిర్వహిస్తూ, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నామన్నారు. తమ సంస్కృతీ సాంప్రదాయాలు కాపాడుకొనే ప్రయత్నంలో ఎదురయ్యే సమస్యలు సమిష్టిగా ఒక వేదికపై చర్చించడానికి ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు.
70 ఏళ్లకు పైగా ఛత్తీస్ ఘడ్ లో నివసిస్తున్న ఎస్.సి., ఎస్.టి. మరియు బి.సి.సామాజిక వర్గాలకు చెందిన తెలుగువారికి తగిన గుర్తింపు లభించక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లను కూడా కోల్పోతున్నామని, పాఠశాలల్లో తెలుగువారి కులం పేరు తెలుగు అని రాస్తారని ఇలాంటి సమస్యల వలన తమ కులం పేరును మార్చి స్థానికుల కులం పేరుతో సమానమైన పేరును రాసుకోవడం జరుగుతోందన్నారు.
ఛత్తీస్ ఘడ్ లో మూడు లక్షలకు పైగా తెలుగువారు నివసిస్తున్నారని, కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ నాయకులు గెలుపుకు తెలుగు ఓటర్లు నిర్ణయాత్మకమైన పాత్ర వహిస్తున్నారని గుర్తు చేశారు. మున్సిపాలిటీ మరియు పంచాయితీల్లో వార్డు ప్రతినిధులుగా తెలుగు వారు అధికంగా ఎన్నికవుతున్నారని తెలిపారు.ఈ సభలకు ఛత్తీస్ ఘడ్ లోని వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న తెలుగు సంఘాల ప్రతినిధులు, భాషాభిమానులు కనీసం 3,000 మంది హాజరవుతున్నారని తెలిపారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించినట్లు తెలిపారు.అలాగే
ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావ్, విజయశర్మ, సాంస్కృతిక శాఖామాత్యులు అజయ్ చంద్రాకర్ పాల్గొంటున్నట్టు తెలిపారు. కేంద్రమంత్రి ,శ్రీకాకుళం ఎంపి రామ్మోహన నాయుడు, సాంస్కృతిక శాఖామాత్యులు కె. దుర్గేష్, ఆరోగ్య శాఖామాత్యులు సత్య కుమార్ యాదవ్ మరియు విద్యా మంత్రి నారా లోకేష్, శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ళ మల్లికార్జున రావులను ఆహ్వానించామని తెలిపారు. సభల్లో జరిగే సాహిత్య చర్చల్లో డా. పసునూరి రవీందర్( హైదరాబాద్), డా.విజయ భాస్కర్ (శ్రీకాకుళం), బాల సుధాకర్ మౌళి ( విజయనగరం), ఎన్. వేణుగోపాల్ (హైదరాబాద్) డా.సుంకర గోపాలయ్య (తాడేపల్లిగూడెం), ప్రొఫెసర్ వినోదిని ( కడప), సిరికి స్వామి నాయుడు ( పార్వతీపురం), పిల్లా తిరుపతిరావు ( రాజాం), బద్రి కుర్మారావు (విజయనగరం), డా. జి వి పూర్ణచందు (విజయవాడ) తదితర సాహిత్యకారులు పాల్గొంటున్నారని, రెండు రోజులు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. విలేకర్ల సమావేశంలో ఛత్తీస్ ఘడ్ తెలుగు మహా సంఘం ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.గణేష్, కార్యవర్గ సభ్యులు కొండప్ప వెంకటరావు, ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, ప్రధాన కార్యదర్శి డా. జి వి పూర్ణచందు పాల్గొన్నారు.