Sidebar


Welcome to Vizag Express
రథసప్తమి వేడుకల్లో సాంస్కృతిక సందడి ప్రధాన ఆకర్షణగా ఆటో రాంప్రసాద్ షో

04-02-2025 22:13:57

రథసప్తమి వేడుకల్లో సాంస్కృతిక సందడి

ప్రధాన ఆకర్షణగా ఆటో రాంప్రసాద్ షో 

శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 2:
 రథసప్తమి వేడుకల్లో భాగంగా తొలిరోజు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా అలరించాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో  ఏర్పాటు చేసిన విశాల వేదికపై ప్రముఖ కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వేడుకల్లో భాగంగా లైట్ మ్యూజిక్, సినీ సంగీతం, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ జానపద సంగీతం, శాస్త్రీయ నృత్యం వంటి వివిధ కళా ప్రదర్శనలు జరిగాయి. ఆరోహి స్కూల్ ఆఫ్ మ్యూజిక్, దుంపల ఈశ్వర్ బృందం, యామినీ కృష్ణ బృందం, పరిమళ బృందం, అనురాధ బృందం, లక్ష్మీ గణపతి శర్మ బృందం వంటి ప్రముఖ కళాకారులు తమ గాన, నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు.

ప్రధాన ఆకర్షణగా ఆటో రాంప్రసాద్ షో: 

ధూంధాం కార్యక్రమం పేరిట ఆటో రాంప్రసాద్, నరేష్, శాంతి స్వరూప్, ఫైమా, ఢీ భూమిక, రేలారే రేలా టీమ్, మిమిక్రీ ఆనంద్, జోష్ శివ, పిన్నీ సాంగ్ ఫేమ్ షన్ముఖ్, సురేష్ రేష్మ (సింగింగ్), బాలాజీ (శ్రీకాకుళం) వంటి ప్రముఖులు పాల్గొన్న ధూంధాం కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆటో రాంప్రసాద్ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తనది చిలకపాలెం అంటూ ప్రాంతీయ అభిమానాన్ని చాటుకున్నాడు. ఫైమా తన డ్యాన్స్ తో అందరినీ అలరించింది. ఇక రాత్రి లేజర్ షో ఏర్పాటు చేశారు. ఇది ప్రేక్షకులకు కనువిందు చేసింది. జిల్లాకు పూర్తిగా తొలిసారి పరిచయం చేసిన లేజర్ షో ఆకర్షణగా నిలిచింది. ఈ లేజర్ షోలో రంగురంగుల కాంతులు ఆకాశంలో వివిధ ఆకారాలుగా ఏర్పడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

పంచరత్న నాటకాలు

రథసప్తమి వేడుకల్లో భాగంగా తొలిరోజు చివరిగా శ్రీ అంజనా కళా సంస్థ సమర్పించిన పంచరత్న పౌరాణిక నాటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ నాటకాలు ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాలు కళారంగాన్ని ప్రోత్సహించడానికి గొప్ప వేదికగా నిలిచాయి. ఈ వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం కూడా మరిన్ని కళా, సాంస్కృతిక, సంగీత కార్యక్రమాల నిర్వహించనున్నారు.