రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం
ఉర్రూతలూగించిన గాయని మంగ్లీ
అలరించిన నృత్య ప్రదర్శనలు
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 4 :
రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుపుకుంటున్న సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ముగిసాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికపై ముగింపు కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను అలరించింది. గాయని మంగ్లీ పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివరగా క్రాకర్స్ షో తో కార్యక్రమాలు విజయవంతంగా ముగిసాయి.
ముందుగా సుందరంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాక్సోఫోన్ వాయిద్య ప్రదర్శన జరగ్గా, తర్వాత వరుసగా, సీతంపేట ఐటిడిఏ జానపద బుర్రకథలు , మావూడూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి . అదే విధంగా నగరానికి చెందిన నీరజా సుబ్రమణ్యం శిష్య బృందం చేసిన శ్రీనివాస కళ్యాణ నృత్య రూపకం, ఆదిత్య అష్టకం నృత్య రూపకం, దేవి స్తుతి నృత్య రూపకం ఎంతగానో అలరించాయి. ఈ నృత్య రూపక ప్రదర్శనలో చిరంజీవులు లావణ్య, శ్రీ హర్షిత, జాహ్నవి స్వేచ్ఛ, కే గాయత్రి, పి ఇంద్రజ, ఊర్మిళ, గ్రేస్వప్రియ, తదితరులు అద్భుతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
అదేవిధంగా డా.శ్రీకాంత్ రఘుపాత్రుని శిష్య బృందం ఆధ్వర్యంలో ప్రేక్షకులను యోగా సహిత నృత్యాన్ని, ఆ విష్ణుమూర్తి 4వ అవతారం అయిన నరసింహ స్వామిని స్తుతిస్తూ కదిరి నృసింహుడు నృత్య రూపకం శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మవారిని స్తుతిస్తూ ఓంకార రూపిణి దేవీ స్తుతి రూపకం ప్రదర్శించారు. ఈ బృందంలో రామ కౌండిన్య, నేహా, వర్షిత, బిందు, చాందిని, శ్రేయశ్రీ, హర్షిత, శ్రీకళ, సుష్మ, నేహా పట్నాయక్, ఊర్మిళ, సుమణి, సంజన, మోక్షిత, తనిష్య, హర్షిణి, హాసిని, వర్షిత అద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే కల్లేపల్లికి సంప్రదాయం డైరెక్టర్ స్వాతి సోమనాథన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వివిధ ఆసనాలతో యోగ నృత్య రూపకం,, తిల్లాన పళ్లెంపై దీపాల డ్యాన్స్ ప్రత్యేక నృత్య కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.