సూర్యనారాయణడి నిజరూప దర్శనం
. పులకించిన భక్తజనం
కలెక్టర్, ఎస్పీ సారధ్యంలో అధికారుల నిరంతర పర్యవేక్షణ
శ్రీకాకుళం, ఫిబ్రవరి 4 : సూర్య జయంతి సందర్భంగా అరసవిల్లి సూర్య దేవాలయంలో స్వామి వారి నిజ రూప దర్శనం చేసుకొని భక్తులు తరించారు. సూర్యుడు తన రథంపై ఉత్తరాయణ మార్గంలో ప్రయాణించడం ప్రారంభించే రోజు రథసప్తమి. అలాంటి ఈ దివ్యమైన రోజున, సోమవారం అర్ధరాత్రి నుంచే ఇంద్ర పుష్కరణి వద్ద పాయసం వండి నైవేద్యాలు పెట్టి భక్తులు మొక్కుబడులు చెల్లించారు. ఎప్పటిలాగానే ఉత్తరాంధ్ర, ఒడిస్సా నుంచి భక్తులు ఈసారి కూడా పోటెత్తారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ సారి మూడు నెలలుగా చేసిన పక్కా ప్రణాళిక సత్ఫలితాలను ఇచ్చింది. స్వయంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి ఏర్పాట్లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దేవాదాయ అధికార్లు, పోలీస్, రెవిన్యూ, ఫైర్ సిబ్బంది సమన్వయంతో వేడుకలను విజయవంతం చేశారు. మూడు రోజుల పాటు శోభాయమానంగా జరిగిన రథసప్తమి వేడుకలు మంగళవారం అర్ధరాత్రి తో ముగిసాయి.
మంగళవారం సాయంత్రం ఏడు గంటల నాటికి దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో వేచివున్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సూర్య నారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి నిజరూపానికి పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, శాసనమండలి, శాసన సభ్యులు ఉన్నతాధికారులు కూడా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. లక్షలాది మంది భక్తులు రథసప్తమి ఉత్సవాలకు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు వేల మంది పోలీసులతో ఏర్పాటు చేసిన పటిష్ఠ బందోబస్తు మధ్య ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా వేడుకలు ముగిసాయి. తొలిసారిగా లైవ్ ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు. ఉచిత క్యూలైన్లలో వచ్చే సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా, నిరంతర దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రాంగణమంతా ఆదిత్యుని నామస్మరణతో మార్మోగింది.
రాష్ట్ర పండుగగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను ప్రకటించి, మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో ఇచ్చిన మరుక్షణం నుంచే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం తొలిరోజు వేలాది మందితో సూర్య నమస్కారాలతో మొదలు పెట్టి, హెలి టూరిజం, రాష్ట్రస్థాయి గ్రామీణ క్రీడల నిర్వహణ, వందలాదిమందితో కళా సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో, క్రాకర్ షో, శోభాయాత్ర లాంటి కార్యక్రమాలతో వినూత్నంగా జరిగాయి. జిల్లా ప్రజల్లో ఆయా కార్యక్రమాలు చెరగని ముద్రను వేశాయి. రథసప్తమి వేడుకల కోసమే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సెంటర్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు, పచ్చదనం కోసం మొక్కలు నాటడం, రంగురంగుల పెయింటింగులు, రోడ్ల మరమ్మతులు చేయించడం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. మొత్తానికి వేడుకలు జయప్రదం కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి, కృషి పట్ల నగర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది.