Sidebar


Welcome to Vizag Express
జోలపుట్టు జలాశయంలో విద్యార్థుల మృతదేహలు లభ్యం

05-02-2025 19:19:07

జోలపుట్టు జలాశయంలో విద్యార్థుల మృతదేహలు లభ్యం 

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి,05: అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జోలపుట్టు జలాశయం ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో శనివారం  గల్లంతైన విద్యార్ధులు మృతదేహాలు లభ్యమయ్యాయి. నాటు పడవల్లో రీల్స్ చేస్తూ పడవ అదుపుతప్పి నీట మునిగి ఇద్దరు 10 తరగతి చదువుతున్న విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం నుండి జలాశయంలో ఓడిఆర్ఎఎఫ్ బృందం, అగ్నిమాపక సిబ్బంది ఐదు రోజులుగా నిరంతరం గాలింపు చర్యలు చేపట్టింది. మంగళవారం సాయంత్రం  విద్యార్థి  అమిత్ కుమార్ మృతదేహం లభ్యమవగా బుధవారం ఉదయం మరో విద్యార్థి శివ మృతదేహం లభ్యమయింది. సంఘటన స్థలంలోనే వైద్యులచే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి దహన సంస్కారాలకు వారి గ్రామాలకు తరలించారు. ఒడిస్సా పొట్టంగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్ర కడమ్ సంఘటన స్థలంలో చేరుకొని ప్రభుత్వం నుండి నాలుగు లక్షల రూపాయలు కుటుంబాలకు అందే విధంగా కృషి చేస్తానన్నారు. రెడ్ క్రాస్ తరపున ఇరు కుటుంబాలకు 20 వేల రూపాయల చోప్పున నందపూర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ పార్వతి అందించారు. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతం కావటంతో ముంచంగిపుట్టు తహసీల్దార్ నరసమ్మ, నందపూర్ తహసిల్దార్ ఐదు రోజులుగా గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యము కావడంతో ఆ ప్రాంతమంతా కుటుంబ సభ్యుల కన్నీటి రోదనతో విషాదఛాయలు అలుముకున్నాయి. జోలపుట్టు జలాశయంలో గలంతై మరణించిన విద్యార్ధులు శివ, అమిత్ కుమార్ కుటుంబాలను ప్రభుత్వం 10 లక్షల ఎక్స్ గ్రేసియ అందించి ఆదుకోవాలని నందపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర కిముడు, రామో కిముడు, బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.