ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్
పార్వతీపురం /సీతానగరం,ఫిబ్రవరి 5 :
గృహాలు మంజూరైన లబ్ధిదారులు తక్షణం తమ గృహాలను నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. బుధవారం బలిజిపేట మండలంలోని మిర్తివలస, బలిజిపేట గ్రామాల్లో ఉపాధి హామీ పనులు, గృహ నిర్మాణ లేఔట్లను, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం గృహాలను మంజూరు చేసిందని, ఆ గృహాలను లబ్ధిదారులు తక్షణం నిర్మించుకోవాలని అన్నారు. ఇంకా నిర్మాణం చేయని గృహాలు ఉంటే వాటిని రద్దుచేసి అవసరమైన లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. లబ్ధిదారులకు అన్ని వివరాలను అవగాహన కలిగించాలని గృహ నిర్మాణ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వేతనదారులతో ముఖాముఖి మాట్లాడారు. వేతనదారుల హాజరును పరిశీలించారు. ఫారం పాండ్లను నిర్మించుకొనుటకు ఆసక్తి చూపించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఫారం పాండ్ల వలన పొలాల్లో నీరు లభ్యంగా ఉంటుందని, పంటలు వేసుకోవడానికి సదుపాయంగా ఉంటుందని చెప్పారు. 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారి వివరాలు పరిశీలించారు. ఉపాధి హామీ పనులను బాగా చేపట్టి గ్రామాల్లో ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. గరిష్ట వేతనం వచ్చే విధంగా పనులు చేపట్టాలని ఆయన సూచించారు. మిర్తివలస చెరువును పరిశీలించి అచ్చట జంగిల్ క్లియరెన్స్ చేయాలని, వర్షాలు కురిసినప్పుడు గండి పడకుండా గట్లను బలంగా వేయాలని ఆయన తెలిపారు. సచివాలయంలో రీసర్వే పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. గ్రామ విజ్ఞాన కేంద్రాల్లో పోటీ పరీక్షలకు అనువైన అనేక పుస్తకలను ఏర్పాటు చేశామని వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. మిర్తివలస అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ విద్యార్థుల బరువు, ఎత్తులను పరిశీలించారు. వారికి అందిస్తున్న పౌష్టికాహార వివరాలను తనిఖీ చేశారు. చిన్నారులకు చక్కటి విద్యా ప్రమాణాలు ఇప్పటి నుండే బోధించాలని సూచించారు. పౌష్టికాహారాన్ని అందించి వారి ఆరోగ్యం మెరుగుదలకు కృషి చేయాలని ఆదేశించారు. గ్రామంలో ఉన్న గర్భిణీలు, బాలింతలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. టేక్ హోమ్ రేషన్ ప్రతి ఒక్కరికి అందాలని ఆయన స్పష్టం చేశారు. రక్తహీనత ఏ ఒక్కరికి ఉండరాదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామ సచివాలయ సిబ్బంది మంచి సేవలను అందించాలని ఆయన ఆదేశించారు.
పల్లె పండుగ పనులు, పంచాయతీరాజ్ పనులను ఫిబ్రవరి మాసాంతానికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పనులు చేయడంలో జాప్యం చేస్తే కఠిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. పనులు పూర్తికాక నిధులు వృధా అయితే సంబంధిత సిబ్బంది బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. సీతానగరం మండలం నిడగల్లులో జరుగుతున్న రహదారి పములను జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, గృహ నిర్మాణ సంస్థ ఇన్చార్జి అధికారి డాక్టర్ పి ధర్మారెడ్డి, మండల అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు