ఒక్క మాతా,శిశు మరణం సంభవించరాదు.
వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ హితవు
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 5 :
జిల్లాలో ఒక్క మాతా, శిశు మరణం కూడా సంభవించరాదని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులకు హితవు పలికారు. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రసవం అయ్యే వరకు సంబంధిత పిహెచ్సీ వైద్యాధికారి ఏఎన్ఎం, ఆశా వర్కర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రసవాలు బాగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో సంభవించిన మాతా శిశు మరణాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. ఈ సందర్బంగా జిల్లాలో ఇప్పటివరకు సంభవించిన మాతా, శిశు మరణాలపై పీహెచ్సీల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఏ ఒక్క కారణంతో మాతా, శిశు మరణం ఉండరాదని, గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు పూర్తి బాధ్యతను వైద్యాధికారులు తీసుకోవాలన్నారు.ప్రతి గర్భిణీకి రికార్డు నిర్వహించాలని,జన్యుపరమైన వ్యాధుల కొరకు కుటుంబ చరిత్రను ముందే తెలుసుకొని వైద్యాన్ని అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరగాలని, ఇతర కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే, ఆ వివరాలు వైద్యులు వద్ద ఉండాలని స్పష్టం చేశారు. గర్భిణీలకు మంచి వైద్యాన్ని అందించాలని, ఆమె తీసుకోవలసిన జాగ్రత్తలు, మందులు గురించి ముందే వివరించి ఎటువంటి మాతా, శిశు మరణాలు లేకుండా చూడాలని తెలిపారు. ఈ విషయంలో ప్రతి వైద్యాధికారి జాగ్రత్తగా పనిచేయాలని, లేదంటే చర్యలు ఉంటాయన్నారు. భవిష్యత్ లో ఎటువంటి మరణాలు సంభవించరాదని, ఆ దిశగా వైద్యాధికారులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పనిచేయాలని కలెక్టర్ హితవు పలికారు. మాతా, శిశు మరణాల నివారణకు గైనకాలజస్ట్, పిడియాట్రిషియన్లతో మెడికల్ ఆఫీసర్లకు, అంగన్వాడీ సూపర్వైజర్లకు శిక్షణ ఇప్పించాలని, డిజిటల్ మీడియా ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మలేరియా కేసులు జిల్లాలో నమోదు కారాదని, కేసులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనీమియా నివారణకు పౌష్టికాహార కిట్లను అందిస్తున్నామని, తద్వారా హిమోగ్లోబిన్ పెరిగేలా చూడాలని అన్నారు. ఒక్క గర్భిణీకి, వసతి గృహల్లో విద్యార్థులకు అనీమియా సమస్య ఉండరాదని కలెక్టర్ తేల్చిచెప్పారు. అభా ఐడీలు పెండింగ్ లేకుండా చూడాలని, ఈహెచ్ఆర్ కచ్చితంగా అమలుచేయాలని, అనీమీయా యాక్షన్ కమిటీ పక్కాగా జరగాలని పేర్కొన్నారు. భవిత కార్డులు నమోదు కావాలనీ, వైద్య సేవా రంగంలో అందిస్తున్న సేవలకు గుర్తుగా పీఎం అవార్డుకు జిల్లా ఎంపిక కావాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్. భాస్కరరావు, డీసీహెచ్ఎస్ డా. బి.వాగ్దేవి, ప్రోగ్రాం అధికారి డా.టి.జగన్మోహనరావు, డిఎల్ఏటీఓ డా.ఎం.వినోద్ కుమార్, ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.విజయ పార్వతి, డిఆర్డిఎ పథక సంచాలకులు వై.సత్యం నాయుడు, డీఐపీఆర్ఓ ఎల్. రమేష్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎస్.కృష్ణ, ఐసీడీఎస్ పీడీ డా. టి.కనకదుర్గ, జిల్లా ఆర్.డబ్ల్యూ.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, ప్రత్యేక వైద్యాధికారులు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.