తాండవ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:
ఖరీఫ్ కు ముందే ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులకు ఆదేశం:
స్పీకర్ అయ్యన్నపాత్రుడు:
నాతవరం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 5:
తాండవ జలాశయం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. తాండవ జలాశయం వద్ద బుధవారం తాండవ ప్రాజెక్ట్ నీటి సంఘాల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ,
నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఏకైక పెద్ద సాగునీటి ప్రాజెక్ట్,తాండవ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే తాండవ జలాశయం మరమ్మత్తు పనులు పూర్తిచేయాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. తాండవ ప్రాజెక్టు ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తాండవ ఆయకట్టు రైతులు అభివృద్ధి కోసం, పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, ఎత్తిపోతల పథకం ద్వారా, పోలవరం జలాలను తాండవ సాగునీటి కాలువలోకి మళ్లించే విధంగా కృషి చేస్తానన్నారు. తాండవ ప్రాజెక్ట్ నుండి నాతవరం వరకు గల పంచాయితీ రాజ్ శాఖకు చెందిన, ఏడు కిలోమీటర్ల రహదారిని, ఆర్ అండ్ బి శాఖలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటానని అయ్యన్న తెలిపారు. సమావేశానికి ముందుగా తాండవ జలాశయం వద్ద వేంచేసిన శ్రీ నల్లగొండమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాండవ ప్రాజెక్టుకు సంబందించిన 27 నీటి సంఘాలకు చెందిన 324 మంది డైరెక్టర్లు, 27 మంది ప్రెసిడెంట్లు, ఐదుగురు డిసి మెంబర్లతో ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో తుని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ రాజాన వీర సూర్య చంద్ర, తాండవ వైస్ చైర్మన్ మేడపురెడ్డి జోగు బాబు, పారిశ్రామికవేత్త, టిడిపి యువనేత వెలగా వెంకటకృష్ణారావు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.